ఖమ్మం కాంగ్రెస్.. ఏంటి ఈ పరేషాన్.!!

 

కాంగ్రెస్ కి మొదటి నుంచి ఖమ్మం జిల్లాలో మంచి పట్టు ఉండేది.. విభజన అనంతరం కూడా ఖమ్మంలో కాంగ్రెస్ బలం తగ్గలేదు.. 2014 ఎన్నికల్లో ఖమ్మం, మధిర, పాలేరు లాంటి అసెంబ్లీ సీట్లలో విజయం సాధించి జిల్లా వ్యాప్తంగా పార్టీ కి బలముందని కాంగ్రెస్ రుజువు చేసింది.. తరువాత మారిన అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కొందరు నేతలు కాంగ్రెస్ ని వీడి  అధికార పార్టీ తెరాసలో చేరారు.. ఆ నేతలైతే కాంగ్రెస్ ని వీడారు కానీ కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకు ఇంకా బలంగానే ఉంది.. ఇది ఖమ్మం కాంగ్రెస్ కి కలిసొచ్చే అంశమే.. అయితే ఇప్పుడు ఖమ్మం కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో తెలియక కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.. కార్యకర్తలను ఇప్పుడు అనేక ప్రశ్నలు వేధిస్తున్నాయి.. ఖమ్మం కాంగ్రెస్ లో రేణుకా చౌదరి వర్సెస్ భట్టి పోరు నడుస్తుందా?.. రేణుక రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి భట్టి పోస్ట్ కి ఎసరు పెట్టబోతున్నారా?.. జలగం ప్రసాద్ తిరిగి కాంగ్రెస్ లోకి వస్తానంటే భట్టి అడ్డుపడుతున్నారా?.. ఇవే ఖమ్మం కార్యకర్తలను వేధిస్తున్న ప్రశ్నలు.. ఇప్పుడు ఖమ్మం కాంగ్రెస్ రాజకీయం అంతా ఈ ప్రశ్నల చుట్టూనే తిరుగుతుంది.

 


రేణుకా చౌదరి గతంలో ఖమ్మం ఎంపీగా పనిచేసారు.. ఆమెకి జిల్లాలో మంచి పట్టుంది.. జాతీయ రాజకీయాల్లో సుపరిచితురాలు.. కాంగ్రెస్ అధిష్టానంతో కూడా మంచి బంధం ఉంది.. అందుకే ఆమెని జాతీయ స్థాయి నేతగానే అందరూ భావిస్తారు.. అయితే ఇప్పుడు రేణుక దృష్టి రాష్ట్ర రాజకీయాలమీద పడినట్టు తెలుస్తోంది.. ఇకనుండి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆమె భావిస్తున్నారట.. అధిష్టానం కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న భట్టి స్థానంలో రేణుకను తీసుకోవాలని చూస్తున్నారట.. భట్టి రాష్ట్ర స్థాయిలోనే మరోపదవిని కట్టబెట్టాలని చూస్తున్నారట.. అయితే ఈ విషయంపై భట్టి మరియు ఆయన వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెల్సుతుంది.. రాష్ట్ర కాంగ్రెస్ కూడా రేణుక జాతీయ రాజకీయాల్లో ఉండటమే కరెక్ట్ అని భావిస్తోందట.. రేణుక రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే సీఎం అభ్యర్థి అనే అవకాశం కూడా ఉందని రాష్ట్ర నాయకత్వం భయపెడుతుందట.. అందుకే రేణుకను జాతీయ రాజకీయాల్లోనే ఉంచాలని రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకురావాలి చూస్తున్నట్టు తెలుస్తోంది.

 


మరోవైపు మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడు జలగం ప్రసాద్ కాంగ్రెస్ లోకి తిరిగి రావాలని చూస్తుంటే భట్టి అడ్డుకుంటున్నారని వార్తలు వినిపించాయి.. కానీ భట్టి వర్గీయులు మాత్రం ఖమ్మంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న మా నేతపై ఇలాంటి ఆరోపణలు చేయటం తగదు అంటున్నారు.. మరోవైపు రాష్ట్ర నాయకత్వం కూడా భట్టి మీద ఎవరో కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతుంది.. కాంగ్రెస్ పార్టీ బలం చూసి ఓర్వలేకే ప్రత్యర్థులు ఇలా వర్గాల పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. కార్యకర్తలను ఇంతగా వేధిస్తున్న ఖమ్మం రాజకీయంపై అధిష్టానం ఎప్పుడు దృష్టి పెడుతుందో?.. వీటికి పరిస్కారం ఎప్పుడు చూపుతుందో వేచి చూడాలి మరి.