ఖమ్మంలో తెరాస బోణి కష్టమేనా?

 

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ మొదటి నుండి కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు బలంగా ఉన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ సాగేది.. ఒకసారి కాంగ్రెస్ పైచేయి సాధిస్తే మరోసారి టీడీపీ పైచేయి సాధించేది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ పార్టీలు మహాకూటమితో దగ్గరయ్యాయి. అసలే జిల్లాలో బలమైన పార్టీలు. ఈ మూడు పార్టీలు మహాకూటమితో దగ్గరవడం.. ఖమ్మంలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న తెరాసను కలవెరపెడుతుంది. తెరాసకు ముందు నుండి ఖమ్మం సమస్య ఉంది. గత ఎన్నికల్లో దాదాపు అన్ని జిల్లాల్లో తెరాస ఎంతో కొంత తన మార్క్ చూపింది కానీ.. ఖమ్మంలో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికల అనంతరం టీడీపీ నుండి సీనియర్ నేత తుమ్మల, కాంగ్రెస్ నుండి ఖమ్మం ఎమ్మెల్యేగా గెలిచిన పువ్వాడ అజయ్, సిపిఎం మద్దతుతో వైసీపీ నుండి ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇలా పలువురు నేతలు తెరాసలో చేరారు. తెరాస నాయకులతో కళకళలాడింది కానీ కాంగ్రెస్, టీడీపీ కేడర్ మాత్రం అలాగే ఉంది. కాంగ్రెస్ లో రేణుక చౌదరి, భట్టి లాంటి సీనియర్ నేతలున్నారు. ఇక టీడీపీలో కూడా మాజీ ఎంపీ నామా, సత్తుపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర లాంటి సీనియర్ నేతలున్నారు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు దగ్గరయ్యాయి. ఓవైపు సీనియర్ నేతలు, మరోవైపు బలమైన కేడర్.. దీంతో ఖమ్మంలో మహాకూటమిని తట్టుకొని తెరాస నిలబడటం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

 


తెరాస మళ్ళీ అధికారం తమదే అనే ధీమాతో ముందస్తుకు సిద్ధమైంది. అయితే ఆ ఆశలకు మహాకూటమి ఆనకట్టలా మారింది. మొన్నటివరకు తెరాస వందకి పైగా సీట్లు వస్తాయి.. ఖమ్మంలో కూడా పాగా వేస్తామంటూ ధీమాగా ఉంది. అయితే మహాకూటమితో పరిస్థితి మారిపోయింది. నిన్నటిమొన్నటి దాకా తెలంగాణలో ఇంకా టీడీపీ ఎక్కడుంది? అన్నవాళ్ళే ముక్కున వేలేసుకుంటున్నారు. ఖమ్మంలో కూడా టీడీపీ ఒకప్పటిలా బలంగా లేదన్న వాళ్ళకి మొన్న బాలకృష్ణ పర్యటనతో కళ్ళుతెరుచుకున్నాయి. స్వచ్చందంగా కార్యకర్తలు కదిలొచ్చారు.. బాలయ్య వెంటనడిచి ఖమ్మంలో పసుపుదళం బలంగా ఉందని నిరూపించారు. దీంతో తెరాస నేతలు ఆలోచనలో పడ్డారు. ఖమ్మంలో మహాకూటమిని తట్టుకొని తెరాస నిలబడుతుందా? అని అనుమానం మొదలైంది. మిగతా స్థానాల్లో ఎలా ఉన్న మంత్రి తుమ్మల ప్రాతినిధ్యం వహించిన పాలేరులో అయినా తెరాస జెండా ఎగురుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు పాలేరులో కూడా పరిస్థితి మారిపోయినట్టు తెలుస్తోంది. అక్కడ సర్వేలు కూడా మహాకూటమికే అనుకూలంగా వస్తున్నాయట. నిజానికి తుమ్మల ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసి పువ్వాడ అజయ్ చేతిలో ఓడిపోయారు. తరువాత తెరాసలో చేరి మంత్రి పదవి పొందారు. అయితే అప్పుడు పాలేరులో ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించడంతో అక్కడ ఉపఎన్నికలు జరిగి తుమ్మల గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినా ఆ స్థానాన్ని కాంగ్రెస్ ఉపఎన్నికల్లో నిలబెట్టుకోలేకపోయింది. అయితే 2014 ఎన్నికల్లో పాలేరులో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఉపఎన్నికల్లో తుమ్మల విజయం సాధించినా ఈ రెండు ఏళ్లలో పరిస్థితులు మారిపోయాయి. తాజా సర్వేల ప్రకారం పాలేరులో మహాకూటమే ముందుందట. దీనిబట్టి చూస్తుంటే ఖమ్మంలో పాగా వేయాలని చూస్తున్న తెరాస అసలు బోణి అయినా చేస్తుందా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ అంచనాలను తారుమారు చేస్తూ తెరాస మహాకూటమిని మట్టి కరిపిస్తుందో లేదో చూడాలి.