ఈ నెలాఖరులోగా కొత్త సచివాలయం పనులు ప్రారంభం

27 ఎకరాల్లో 20శాతం స్థలంలోనే కొత్త సచివాలయం..
ఆరు అంతస్తుత్లో దీర్ఘ చతురస్రారాకంలో నిర్మాణం..
రెండు హెలిప్యాడ్స్, విశాలమైన పార్కింగ్ సదుపాయాలు..
రాష్ట్ర అధికార పుష్పం తంగేడు ఆకారంలో ఫౌంటెన్లు..
ఫ్రాన్స్ లోని  ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ నమూనాలో..
డిజైన్ చేసిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్‌..
ఈ నెలాఖరులోగా పనులు ప్రారంభం..

తెలంగాణ కొత్త సచివాలయం అత్యాధునిక హంగులతో నిర్మించడానికి ప్రభుత్వం సిద్దమైంది.  పాత సచివాలయం ఉన్న 27ఎకరాల స్థలంలో కేవలం 20శాతం మాత్రమే భవననిర్మాణానికి వినియోగించనుంది. మిగతా స్థలంలో రెండు హెలిప్యాడ్స్, విశాలమైన పార్కింగ్ సదుపాయలు, పార్క్ లు, ఫౌంటెన్లు ఏర్పాటు చేసేలా డిజైన్ చేశారు.  ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీర్ఘ చతురస్రాకారంలో ఆరు అంతస్తులతో కొత్త భవనాన్ని 500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాస్తు దోషం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ల్యాండ్ స్కేప్‌లు, రాష్ట్ర అధికార పుష్పమైన తంగేడు పువ్వు ఆకారంలో ఫౌంటెన్లు, ఒకేసారి 800 కార్లు పార్కు చేసేలా విశాలమైన పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తారు. ఒకేసారి రెండు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు చేయనున్నారు.

ఫ్రాన్స్‌లోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ భవనం స్ఫూర్తితో డిజైన్ నమూనాను ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్‌ రూపొందించారు. కొత్త భవనం నమూనాను ఖరారు చేశారు. అయితే దక్కన్ వాస్తురీతుల సమ్మిళితం ఈ భవనం డిజైన్ లో అగుపిస్తుంది. ప్రధానంగా భవనస్థంభాలు కాకతీయ వాస్తురీతులకు దగ్గరగా ఉండటంతో పాటు గవాక్షాల్లో దక్కన్ రీతులు గోచరిస్తున్నాయి. ఈ నెలాఖరులో పనులు ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.