TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పర్యావరణానికి పెద్దపీట.. 50శాతం పచ్చదనం లక్ష్యం.. చంద్రబాబు

Published on: Tue Jun 3, 2025 9:51AM

ఆంధ్రప్రదేశ్ లో పర్యావరణానికి పెద్ద పీట వేయాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సంకల్పించింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిం చారు. సచివాలయంలో సోమవారం జరిగిన ఈ సమావేశంలో గురువారం (జూన్ 5)న పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఆ ఒక్క రోజే కోటి మొక్కలు నాటే బృహత్కార్యక్రమం చేపట్టాలన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లాల కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిథులు చురుగ్గా పాల్గొనాలని,  విద్యాసంస్థలు, వైద్యశాలలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలతో పాటు బస్ స్టేషన్లు, రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

గత ఏడాది రాష్ట్రంలో పచ్చదనం 29 శాతం ఉండగా, ఈ ఏడాది అది 30.5 శాతానికి పెరిగిందని చెప్పిన చంద్రబాబు,  రాష్ట్రంలో ఉద్యానవనాల సాగు, అటవీ ప్రాంత విస్తరణతో కలిపి 2033 నాటికి పచ్చదనాన్ని 37 శాతానికి, 2047 నాటికి 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశించారు.  ఇందుకోసం  ఏటా   1.5 శాతం మేర పచ్చదనం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కలు నాటడంతో సరిపోదనీ, అలా నాటఇన మొక్కలను సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలన్నారు.  

సీఆర్డీఏ పరిధిలోని అటవీ ప్రాంతంతో సహా మొత్తం పచ్చదనంపై శాటిలైట్ల సహాయంతో స్పష్టమైన సమాచారం సేకరించాలని, నాటిన ప్రతీ మొక్కకూ జియో ట్యాగింగ్ చేయాలని  ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించేందుకు సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం తీసుకునేలా ఒక విధానాన్ని రూపొందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.  రాష్ట్రాన్ని హరిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.