'భీమ్లా' వర్సెస్ 'నాయక్'.. ఎవరికి 'ఇగో'.. లోకేశ్ శపథం.. టాప్‌న్యూస్ @7pm
Published on: Thu Feb 24, 2022 5:48PM
1. భీమ్లా నాయక్ సినిమాపై ఏపీలో ఆంక్షలు ఆగలేదు. థియేటర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సీజ్ చేస్తామని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. జీఓ నెంబరు 35 ప్రకారం టిక్కెట్ ధరలు వసూలు చేయాలని ఆదేశించారు. బెనిఫిట్ షోలు, అదనపు షోలకు అనుమతి లేదని లిఖిత పూర్వక ఆదేశాలిచ్చారు. శుక్రవారం థియేటర్ల దగ్గర నిఘా ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలని బెజవాడలో హీరో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు.
2. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై జగన్ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. జగన్ చర్యలతో పవన్‌కు ఏం కాదు.. నిర్మాతలకే ఇబ్బందని అన్నారు. పవన్‌ను ఏం చేయలేక.. సినిమా వారిపై పడ్డారా? అని ప్రశ్నించారు. సినీ పరిశ్రమ కోసం సీఎం జగన్‌కు.. చిరంజీవి దండం పెట్టడం బాధ కల్గించిందని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు.
3. వైసీపీ నేతలపై నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. "శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. విజయలక్ష్మి గురించి, వైఎస్ భారతి గురించి, జగన్ కుమార్తెల గురించి మేం అలా మాట్లాడితే ఎలా ఉంటుందో వాళ్లు ఆలోచించుకోవాలి. అది మా సంస్కృతి కాదు.. ఓ తల్లి ఎలా బాధపడుతుందో కొడుకుగా చూశా. ఎవరైతే అవమానకరంగా మాట్లాడారో వాళ్లు క్షమాపణ చెప్పే వరకు నేను వాళ్లను వదిలిపెట్టనని నా తల్లికి శపథం చేస్తున్నాను" అని నారా లోకేశ్ మండిపడ్డారు.
4. తిరుమల వెంకన్నను అపవిత్రం చేస్తున్నారని.. హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. సేవా టిక్కెట్ల ధరలు పెంచేశారని.. భక్తులను శ్రీవారికి దూరం చేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఇక, ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే.. వైసీపీ నేతలు బూతులు తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
5. అయ్యన్నను ఎదుర్కోలేక సీఎం జగన్ పోలీసులను పంపిస్తున్నారని.. ఏపీ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇక్కడ పోలీసుల మోహరింపు, నిర్బంధం చూస్తుంటే నర్సీపట్నంలో ఉన్నామా?.. ఉక్రెయిన్‌లో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందన్నారు లోకేశ్.
6. ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ విడిచి వెళ్లరని భావిస్తున్నామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. జగ్గారెడ్డితో భట్టి భేటీ అయ్యారు. ఆయనకు కొన్ని ఇబ్బందులున్నాయని, అవి తమ దృష్టికి తెచ్చారని చెప్పారు. జగ్గారెడ్డి రాజీనామా చేయకుండా సముదాయించామని, ఆయన లేవనెత్తిన అంశాలపై అధిష్టానంతో మాట్లాడుతామని భట్టి తెలిపారు.
7. రైతు శ్రేయస్సు కోసం ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నారో.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను చూసి నోర్చుకోమంటూ.. సీఎం జగన్‌పై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కన్నబాబుకు అగ్రికల్చర్ స్పెల్లింగ్ తెలుసా?.. ఇరిగేషన్ మంత్రి అనిల్‌కు నీటిపారుదల గురించి తెలుసా? అలాంటి వారిని మంత్రులుగా పెట్టుకుంటే ఏం ఉపయోగమని మండిపడ్డారు సోమిరెడ్డి.
8. రష్యా దాడులతో.. భారత్ సాయాన్ని కోరింది ఉక్రెయిన్. ఉద్రిక్తతలను తగ్గించడంలో భారత్ కీలక పాత్ర పోషించగలదని, ఈ విపత్కర పరిస్థితుల్లో ఢిల్లీ తమకు అండగా ఉండాలని భారత్‌లోని ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా కోరారు. రష్యా-ఉక్రెయిన్ విషయంలో భారత ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు.
9. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడంతో బంగారం ధర అమాంతం పెరిగిపోయింది. గురువారం భారత్‌లో 10 గ్రాముల బంగారం ధర 51,396కి చేరింది. కిలో సిల్వర్ రేట్.. 65,876కు పెరిగింది. మరోవైపు, స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. క్రూడాయిల్ ధర భారీగా పెరిగింది. డాలర్ విలువ సైతం పైపైకి పోతోంది.
10. తమ దేశంపై దాడి చేసిన రష్యా సైనికుల్లో ఇద్దరిని బందీలుగా చేసుకున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఇప్పటివరకూ 6 రష్యా యుద్ధ విమానాలను కూల్చివేశామని ఉక్రెయిన్ తెలిపింది. అటు, రష్యా జరిపిన దాడుల్లో ఉక్రెయిన్‌లోని పలు సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. రష్యా బాంబు దాడుల్లో ఉక్రెయిన్ రక్షణ కార్యాలయం పూర్తిగా దెబ్బతింది. రష్యా దాడుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని, తొమ్మిది మంది గాయపడ్డారని ఉక్రెయిన్ ప్రకటించింది.


