TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భీమ్లా మేనియా.. జ‌గ‌న్‌కు ఝ‌ల‌క్‌.. ఢిల్లీకి కేసీఆర్‌.. టాప్‌న్యూస్ @ 7pm

Published on: Wed Feb 23, 2022 5:23PM

1. ‘భీమ్లా నాయక్‌’ సినిమాను జగన్ సర్కార్ వెంటాడుతోంది. కొన్ని జిల్లాల్లో భీమ్లా నాయక్‌ ప్రదర్శించే ఎగ్జిబిటర్లతో అధికారులు భేటీ నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధరలు ఉండాలంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. పాత ధరలకే టికెట్‌లు విక్రయించాలంటూ ఎగ్జిబిటర్లకు అధికారులు ఫోన్ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. 

2. సీఎం జ‌గ‌న్ త‌ర‌లిరాగా.. ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో.. దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ఉదయగిరిలోని మెరిట్స్ కాలేజీ ప్రాంగణంలో జరిగాయి. గౌత‌మ్‌రెడ్డిని కడసారి చూసేందుకు రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి భారీగా వైసీపీ శ్రేణులు, అభిమానులు తరలి వచ్చారు. సింహపురి కన్నీరు సంద్ర‌మైంది. 

3. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి కొమురవెల్లి మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టులను అడ్డుకోవాలని చాలా మంది ప్రయత్నించారని, ఆ కుట్రలను చేధించామన్నారు కేసీఆర్‌. ఇంజనీర్లు కూడా భయపడకుండా పనులు చేశారంటూ వారిని అభినందించారు. 

4. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వారంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు హ‌స్తిన‌లో వివిధ పార్టీల ముఖ్యనేతలను కలిసే అవకాశం ఉంది. జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలని ఇప్పటికే భావిస్తున్న కేసీఆర్ ఢిల్లీ వేదికగా ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లతో సమావేశం అవుతానని, వివిధ అంశాలపై వారితో చర్చిస్తానని గ‌తంలో కేసీఆర్ ప్రకటించగా.. ఇప్పుడు అందుకే ఢిల్లీ వెళ్తున్నారని అంటున్నారు.

5. అయ్యన్నపాత్రుడు వాస్తవాలు మాట్లాడితేనే కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారని... మరి వైసీపీ నేతలు చెప్పే అబద్ధాలకు ఏం చేయాలని  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రశ్నించారు. వైసీపీ నేతల బూతులు పోలీసులకు వినసొంపుగా ఉన్నాయా? అని మండిపడ్డారు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై కేసులు పెడితే కనీసం స్పందించని పోలీసులు.. జిల్లాలు దాటి మరీ టీడీపీ నేతలను అరెస్ట్ చేయడానికి వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకత అంటూ లోకేష్ మండిప‌డ్డారు. 

6. వివేకా హత్య కేసును దర్యాప్తు  చేస్తున్న సీబీఐ అధికారి రామ్‌సింగ్‌పై నమోదు చేసిన కేసులో ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. కడప కోర్టు ఆదేశాల మేరకు రామ్‌సింగ్‌పై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తు అధికారిపై కేసు నమోదు చేయడం పట్ల సీబీఐ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ అనంతరం తదనంతర చర్యలన్నింటిపై హైకోర్టు స్టే ఇచ్చింది.  అధికారిపై ఎటువంటి చర్యలు చేపట్టవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

7. గతంలో జయలలిత కేసు విచారణ కర్ణాటకలో జరిగినట్లు వివేకా హత్య కేసు విచారణ వేరే రాష్ట్రంలో చేపట్టాలని టీడీపీ నేత బోండా ఉమ డిమాండ్ చేశారు. బాబాయ్ హత్య కేసు వెలికితీస్తున్న సీబీఐ అధికారులపై పోలీసులతో కేసు పెట్టించి జగన్‌రెడ్డి చరిత్రకెక్కారన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌ ఆదేశాలు సీబీఐ పాటించట్లేదని కక్షకట్టారని బోండా ఉమ విమర్శించారు. 

8. పీఆర్‌సీ వ్యవహారంపై ఏపీ హైకోర్టు సీరియస్‌ అయ్యింది. జీతం నుంచి రికవరీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పీఆర్‌సీ నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఉద్యోగులు వేసిన పిటీషన్‌‌పై కౌంటర్‌ కూడా దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

9. ప్రజలకు అబద్ధాలు చెప్పడంలో సీఎం జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత అన్నారు. అంగన్‌వాడీ వర్కర్లకు 26 వేలు జీతం ఇస్తామని చెప్పి జగన్ మోసం చేశారని ఆరోపించారు. ఇకనుంచి మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా సీఎం ఇంటిని ముట్టడిస్తామని ఆమె హెచ్చరించారు. జగన్‌కు మహిళలు బడిత పూజ చేసే రోజు దగ్గర పడిందని అనిత హెచ్చ‌రించారు. 

10. అంగన్‌వాడీ ఆశా వర్కర్ల సమస్యను పరిష్కరిస్తామని సీఎం జగన్ చెప్పారని, ఇప్పుడు న్యాయం చేయాలని అడిగిన ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లను అరెస్ట్ చేస్తున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. చెప్పింది చేయకపోతే కాలర్ పట్టుకోవాలని జగన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల మంది ఆశావర్కర్లు, లక్షకు పైగా అంగన్‌వాడీ టీచర్లు ఉన్నారన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.