TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జ‌గ‌న్‌ను క్ష‌మించేదేలే.. అశోక్‌పై థ‌ర్డ్‌డిగ్రీ?.. కేసీఆర్ వార్నింగ్‌.. టాప్‌న్యూస్ @7pm

Published on: Fri Feb 11, 2022 6:07PM

1. ధైర్యం ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు కోటీశ్వరులవుతుంటే పేదలు నిరుపేదలుగా మారుతున్నారన్నారు. 2 లక్షల కోట్ల సంపద గల అమరావతిని నాశనం చేసి.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన జగన్‌ను చరిత్ర క్షమించదన్నారు చంద్ర‌బాబు. 

2. ప్ర‌భుత్వ‌ ఉద్యోగుల పక్షాన పోరాడటం ఎమ్మెల్సీ అశోక్‌బాబు చేసిన తప్పా? అని చంద్రబాబునాయుడు నిల‌దీశారు. క్విడ్‌ప్రోకోలో భాగంగానే అశోక్‌బాబుపై విజ‌య‌వాడ‌కు చెందిన మెహర్ కుమార్‌తో తప్పుడు ఫిర్యాదు చేయించార‌ని ఆరోపించారు. ఆ మెహ‌ర్ కుమార్ భార్యకు బ్రాహ్మణ కార్పొరేషన్‌లో నామినేటెడ్‌ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌లోనూ అశోక్‌బాబు తన విద్యార్హత ఇంటర్‌ అని పేర్కొన్నారని స్ప‌ష్టం చేశారు. టైపింగ్‌ పొరపాటు వల్ల జరిగిన అంశంపై ఇంత కక్ష సాధింపా? అని చంద్రబాబు మండిప‌డ్డారు. 

3. ఎమ్మెల్సీ అశోక్‌బాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయస్థానం బెయిల్‌ పిటిషన్‌ను నిరాకరించింది. లోకాయుక్తను పార్టీగా చేయాల్సిందిగా పిటిషనర్లకు సూచించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీ అధికారులకు ఆదేశిస్తూ తదుపరి కేసు విచారణను సోమవారంకు వాయిదా వేసింది.

4. టీడీపీ నేత, ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్టును ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఖండించారు. లోకాయుక్తలో ప్రభుత్వానికి తెలిసిన వారితో పిటిషన్ వేయించి సీఐడీతో అశోక్‌బాబును అరెస్ట్ చేయించారని విమర్శించారు. అర్ధరాత్రి అరెస్ట్ ఏంటో అర్ధం కావడం లేదని.. అశోక్‌బాబును ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలీటం లేదని రఘురామ అన్నారు. అశోక్‌బాబు ఏమైనా తప్పు చేస్తే సర్వీస్ రూల్స్ యాక్షన్ తీసుకుంటుందని, కానీ సీఐడీకి అప్పగించడం ఏంటని ప్రశ్నించారు. అరెస్టుపై రాష్ట్రపతి, కేంద్ర హోమంత్రికి లేఖ రాస్తానన్నారు ఎంపీ రఘురామ.

5. సినిమా టికెట్ల ధరలపై ఈ నెల 17న కమిటీ భేటీ కానుంది. సభ్యులకు ఉన్నతాధికారులు సమాచారం పంపారు. భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. హీరోలు చేసిన సిఫార్సులపై కమిటీ భేటీలో చర్చించనున్నారు. టికెట్ ధరలు, అదనపు షోలు, భారీ బడ్జెట్‌ చిత్రాలు వంటి అంశాలపై చర్చ జరగనుంది. 

6. కేంద్రానికి సీఎం కేసీఆర్ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. మమ్మల్ని ముట్టుకుంటే అడ్రస్‌ లేకుండా చేస్తామని హెచ్చరించారు. అవసరం అయితే ఢిల్లీ దాకా వస్తామని, దేశ రాజకీయాల్లో పాత్ర పోషించాల్సివస్తే కొట్లాడ్డానికి సిద్దమని కేసీఆర్‌ అన్నారు. విద్యుత్‌ సంస్కరణల పేరుతో మోదీ పంచాయితీ పెడుతున్నారని జనగామ బహిరంగసభలో సీఎం కేసీఆర్ విమర్శించారు. 

7. మార్చి తర్వాత ప్రతి నియోజకవర్గంలో 2 వేల కుటుంబాలకు ధళిత బంధు పథకాన్ని ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు ధళిత బంధు అమలు చేస్తామని ప్రకటించారు. దేశంలోని టాప్ 10 అత్యుత్తమ గ్రామాలలో.. 7 తెలంగాణ గ్రామాలు ర్యాంకు సాధించడం గర్వకారణం అన్నారు కేసీఆర్. 

8. ఏపీలో పార్టీ చచ్చిపోతున్నా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు. పార్లమెంట్‌లో ప్రధాని వ్యాఖ్యలకు మద్దతుగా టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిలిచారన్నారు. ఉలిక్కిపడి ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిరసనలకు దిగారని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

9. 15 సార్లు యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం కేసీఆర్‌.. ఒక్క‌సారి కూడా భువనగిరి సందర్శించకపోవడం బాధాకరమన్నారు ఎంపీ కోమ‌టిరెడ్డి. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని సీఎం అనడం స‌రికాద‌ని.. వెంటనే ఆ వ్యాఖ్య‌లు ఉపసంహరించుకోవాలని కోమటిరెడ్డి సూచించారు. ఆగమేఘాల మీద ప్రగతి భవన్ నిర్మించిన సీఎం.. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. 

10. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన డిజిటల్ రికార్డులను అందజేయాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది. డిజిటల్ రికార్డులు, కాల్ డేటా.. నిందితులు, సాక్షుల వాంగ్మూలానికి సంబంధించిన రికార్డులన్నీ తమకు అందజేయాలని ఆ లేఖలో ఈడీ కోరింది.