వైసీపీ నేతలకు వార్నింగ్.. బండి రగడ.. కొత్త పార్టీ ఖాయమా.. కలలోకి కృష్ణుడు..టాప్ న్యూస్@1PM
Published on: Tue Jan 4, 2022 11:50AM
ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో జగన్ సమావేశమై పలు అంశాలపై చర్చిస్తున్నారు. ఏపీలో రహదారుల నిర్మాణం, జాతీయ రహదారుల విస్తరణపై ఆయన గడ్కరీతో మాట్లాడుతున్నారు. తీర ప్రాంతం వెంబడి నాలుగు లైన్ల రహదారుల నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు. విశాఖ-భోగాపురం జాతీయ రహదారి నిర్మాణంపై చర్చించారు.
-------
ఏపీలోని కృష్ణా జిల్లా, మైలవరంలో వైసీపీ నేతల్లో విభేదాలు తలెత్తుతుండడంతో మంత్రి పెద్దిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీ సీటు కోసం వర్గపోరు సాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ విషయంపై స్పందిస్తూ.. భవిష్యత్తులోనూ మైలవరం నియోజక వర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా వసంత కృష్ణ ప్రసాద్ కొనసాగుతారని చెప్పారు. ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్లేనని స్పష్టం చేశారు
------
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి మళ్లీ సీఎం పీఠాన్ని అధిష్ఠిస్తారని ఏపీ డిప్యూటీ సీఎం దర్మాన కృష్ణదాస్ ధీమా వ్యక్తం చేశారు. అదే కనుక జరగకుంటే తాను రాజకీయాల నుంచి వైదొలగుతానని సవాలు విసిరారు. శ్రీకాకుళంలో నిన్న డ్వాక్రా బజార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ధర్మాన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
--
ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై వివాదం చెలరేగుతోన్న విషయం తెలిసిందే. దీనిపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. ఈ రోజు నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పేద ప్రజల గురించి సీఎం జగన్ ఆలోచించట్లేదని అన్నారు.సామాన్యుల కోసం ఆర్టీసీ టికెట్ ధరలు తగ్గించే దమ్ము సీఎం జగన్ రెడ్డి గారికి లేదా? అని నాదెండ్ల మనోహర్ నిలదీశారు.
----
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్టు చేశారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు బీజేపీ భయపడబోదని తెలిపారు. పూర్తి శక్తితో కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపట్ల బీజేపీ కార్యకర్తలు పోరాటాన్ని కొనసాగిస్తారని చెప్పారు. తెలంగాణ నుంచి అప్రజాస్వామిక కేసీఆర్ ప్రభుత్వాన్ని పెకలించే వరకు విశ్రమించబోమన్నారు
------
కాపు, దళిత, బీసీ సామాజికవర్గాలను ఉద్దేశించి కాపు నేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందే కానీ, మన జాతులకు మాత్రం రాలేదని లేఖలో ఆయన పేర్కొన్నారు. తక్కువ జనాభా ఉన్న జాతులు మాత్రమే అధికారాన్ని అనుభవిస్తున్నాయని... ఎక్కువ జనాభా ఉన్న మనం అధికారాన్ని ఎందుకు అనుభవించకూడదని ఆయన ప్రశ్నించారు. అధికారం ఇవ్వాలని అడిగితే ఇవ్వరని... అధికారాన్ని గుంజుకోవాలని అన్నా
----
బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అల్లుడు కవల వెంకట నరసింహంపై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదయింది. ఈ అంశంపై సోము వీర్రాజు కుమార్తె సూర్యకుమారి స్పందించారు. ఈ లోన్ వ్యవహారంతో తన తండ్రికి ఎటువంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. తన తండ్రి ఇంటికి, తమకు ఎలాంటి సంబంధాలు, రాకపోకలు లేవని చెప్పారు. బిజినెస్ లావాదేవీల్లో భాగంగానే తాము లోన్ తీసుకున్నామని చెప్పారు. కావాలనే తమపై కేసు పెట్టారని... ఇదంతా రాజకీయ కుట్రలో భాగమని మండిపడ్డారు.
---------
నెల్లూరు జిల్లా కావలిలో మద్యం ఫూటుగా సేవించి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరుడు హనీఫ్ వీరంగం చేశాడు. కందుకూరు నుంచి బెంగుళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు హనీఫ్ వైపు వచ్చింది. ప్రమాదాన్ని గమనించి డ్రైవర్ తప్పించాడు. అయినా కూడా డ్రైవర్, అడ్డొచ్చిన సిబ్బందిపై హనీఫ్ దాడి చేశాడు. అధికారం తమదంటూ ఆర్టీసీ బస్టాండ్‌లో హల్ చల్ చేశాడు. సుమారు 45 నిమిషాల పాటు ఆర్టీసీ బస్టాండ్‌లోనే బెంగుళూరు బస్సు నిలిచిపోయింది.
---
ఏపీలోని జగన్ రెడ్డి ప్రభుత్వానికి షాకుల మీద షాకులు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర సర్కార్ లోన్ల విషయంలో పరిమితి విధించింది. వరదలతో వేల కోట్ల రూపాయల నష్టం జరిగినా కేంద్ర పైసా సాయం కూడా విదల్చలేదు. తాజాగా టీటీడీకి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. టీటీడీకి ఎఫ్‌సిఆర్‌ఏ లైసెన్స్ రెన్యువల్ కాలేదు. దీంతో విదేశీ విరాళాల సేకరణకు టీటీడీకి బ్రేక్ పడింది.
---
శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్)లో కరోనా కలకలం రేగింది. ఇద్దరు వైద్యులతో సహా 12మందికి పాజిటివ్ వచ్చింది. గత నెల 27వ తేది నుంచి వరసగా కేసులు నమోదవుతున్నాయి. ఒమైక్రాన్ అయి ఉండొచ్చనే అనుమానంతో ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు.
-----
కృష్ణుడు ప్రతిరోజూ తన కలలోకి వస్తాడని, తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ చెబుతున్నాడని యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. శ్రీకృష్ణ భగవానుడు తన కలలోకి వచ్చి యోగి ఆదిత్యనాథ్ ను మధుర నియోజకవర్గం నుంచి బరిలోకి దింపమన్నాడంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాజ్యసభ సభ్యుడు హరనాథ్ సింగ్ రాసిన లేఖకు కౌంటర్ గా అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
---


