జైలు ఖాయమట.. వివేకా కేసులో ట్విస్ట్.. బార్ ఓపెన్.. టాప్ న్యూస్@7PM
Published on: Tue Dec 28, 2021 6:04PM
విజయవాడలో బీజేపీ నిర్వహించిన ప్రజా ఆగ్రహ సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలు అవినీతికి పాల్పడుతున్నాయని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, వైసీపీ పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది నేతలు బెయిల్‌పై బయట ఉన్నారని, వారంతా త్వరలోనే జైలుకు వెళ్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు ప్రకాశ్ జవదేకర్-------ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత, ఎంపీ సుజనాచౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఏం జరుగుతోందని కేంద్ర హోంశాఖ నిత్యం నిఘా వేస్తోందన్నారు. అధికార పార్టీ తప్పిదాలకు సహకరించే పారిశ్రామిక వేత్తలపైనా కేంద్రం కన్నేసిందని తెలిపారు. చట్ట విరుద్ధంగా వ్యవహరించే అధికారులపైనా నిఘా పెట్టిందని అన్నారు.ప్రతిపక్షంగా ఏం చేయాలో టీడీపీ అది చేస్తే మంచిదని సుజనాచౌదరి హితవుపలికారు.
------
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ముఖ్యమంత్రి జేబులో నుంచి ఇస్తున్నారా? అని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. కేంద్రం కూడా నిధులు ఇస్తోందని, మరి జగనన్న పేరు ఏంటని నిలదీశారు. ప్రభుత్వం ఖర్చుతో ఇష్టానుసారంగా పార్టీ పేరు మీద ప్రకటనలు ఇస్తున్నారని ఆరోపించారు. సమాచార శాఖ కార్యదర్శికి అసలు బుద్ధి ఉందా? అని ప్రశ్నించారు.
-
జగన్ ప్రభుత్వానికి ఎవరైనా ఒకటేనని మంత్రి పేర్ని నాని అన్నారు. సినిమా థియేటర్లపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించడం సరికాదని అన్నారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే వ్యత్యాసం తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు. చంద్రబాబు తన బామ్మర్ది తీసిన చారిత్రాత్మక చిత్రానికి పన్ను మినహాయింపులు ఇచ్చారని.. చిరంజీవి సినిమాకు అడిగినా మినహాయింపులు ఇవ్వలేదని తెలిపారు.
----
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. తాజాగా వైఎస్ వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డి మరో సంచలన ఆరోపణలు చేశారు. సీబీఐ అధికారులు కొందరి పేర్లు చెప్పాలని తనను బెదిరించారని పులివెందుల కోర్టులో ఫిర్యాదు చేశారు. సిబిఐ అధికారులు తనను అనేకమార్లు పులివెందుల నుంచి ఢిల్లీకి పిలిచి విచారణ చేసి తనను ఇబ్బందులకు గురి చేశారని, తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగం చేశారని కోర్టుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
------
మంత్రి గుమ్మనూరు జయరాం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హోళగుంద మండలం పెద్ద గోనేహల్ రహదారి విషయంలో మంత్రి స్థానికుడితో మాట్లాడారు. ‘‘కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ కాపీపై సంతకం చేయమని ఎంపీడీవోకు చెప్తానని, వినకపోతే రివర్స్ కేసు పెట్టిస్తానని ఎంపీడీవోను బెదిరిస్తానంటూ మంత్రి గుమ్మనూరు జయరాం ఆడియోపై స్థానికంగా విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి బీసీ సామాజిక వర్గానికి మద్దతు పలుకుతున్నారంటూ ఆలూరులో దళితులు ధర్నాకు దిగారు.
----
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం వైకుంఠ ద్వారాలు 10 రోజుల పాటు తెరుచుకోబోతున్నాయి. జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలను తెరుస్తున్నామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. భక్తులకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశం కల్పిస్తామని చెప్పారు.ప్రతి ఏడాది వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఏకాదశి, ద్వాదశి రెండు రోజులు మాత్రమే ఈ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు.
---
ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి మరో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అదనంగా తెలంగాణ నుంచి కేంద్రం సేకరించనుంది. ఇదే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ సమాచారం ఇచ్చారు. రాష్ట్రం నుంచి 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రం తీసుకోనుంది. దాంతో కేంద్రం కోసం 68.65 లక్షల టన్నుల వరిధాన్యాన్నిరాష్ట్ర ప్రభుత్వం సేకరించనుంది.
-----
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పెంచని చార్జీలు లేవంటూ వైఎస్ షర్మిల విమర్శించారు. మొన్న ఆర్టీసీ చార్జీలు, ఇవాళ కరెంట్ చార్జీలు పెంచారని ఆరోపించారు. 50 యూనిట్లలోపు విద్యుత్ వాడుకునే పేదలను కూడా వదలడం లేదని మండిపడ్డారు. ఏడాదికి రూ.6,800 కోట్ల లోటును పూడ్చేందుకే.. సామాన్యుడిపై విద్యుత్ భారాన్ని మోపారన్నారు. దొర పోకడల వల్ల తెచ్చిన అప్పులపై.. మిత్తిని ప్రజల నుంచే వసూల్ చేస్తున్నారన్నారు
----
నిమ్మళంగా ఉండే పరిస్థితుల్లో ఉండాలని కోరుకోవడానికి బదులుగా సవాళ్ళను ఎంచుకోవాలని విద్యార్థులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇప్పుడు కొత్తవాటి గురించి భయం అనేదే లేదన్నారు. యావత్తు ప్రపంచాన్ని తెలుసుకునే సత్తా విద్యార్థులకు ఉందన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూరు 54వ స్నాతకోత్సవంలో ప్రధాని మోడీ మాట్లాడారు.


