వణికిస్తున్న వైరస్.. ఎర్రవల్లి రగడ.. రాహుల్ మాట విన్న మోడీ.. టాప్ న్యూస్@1PM
Published on: Sun Dec 26, 2021 11:37AM
ఎన్నో ఏళ్లుగా న్యాయవ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటోందని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. రాజ్యాంగం మూడు సమాన వ్యవస్థలను తయారు చేసిందని, న్యాయవ్యవస్థలో ప్రతీ చర్యకు స్థిరమైన రికార్డ్ ఉండాలన్నారు. రాజ్యాంగ పరిధిని తెలుసుకుని అందరూ పనిచేయాలని సూచించారు. ఇప్పుడు హ్యాకింగ్ అతిపెద్ద సమస్యగా మారిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం జడ్జీలకు చాలా ముఖ్యమని, ప్రాసిక్యూటర్లను నియమించడానికి ప్రత్యేక కమిటీ వేయాలన్నారు.కానూరులోని సిద్ధార్థ బీటెక్ కాలేజీలో జస్టిస్ లావు వెంకటేశ్వరరావు స్మారకోపన్యాస సభకు ముఖ్య అతిథిగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు
------
ఏపీలో ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్నా వైసీపీ ప్రభుత్వంలో చలనం లేదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజల ప్రాణాలకంటే కక్షసాధింపు చర్యలకే సీఎం జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్లో ఏపీ వెనకబడి ఉందన్నారు.ఇతర రాష్ట్రాలు కరోనా కట్టడిలో ముందుంటే సీఎం జగన్ కక్షసాధింపు చర్యల్లో ముందున్నారని ధ్వజమెత్తారు.ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు శూన్యమని చెప్పారు.
----
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. బండి సంజయ్‌ది నిరుద్యోగ దీక్ష కాదని.. సిగ్గులేని దీక్షని అన్నారు. ఆయన తలపెట్టిన దీక్ష పచ్చి అవకాశవాదమేనని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో నిరుద్యోగ యువతకు ఏం చేసిందో ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలిచ్చారో లెక్క చెప్పే దమ్ముందా? అని నిలదీశారు.
--
ఆడపిల్లలను వారి ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోనివకుండా కార్పొరేట్ కంపెనీలకు లేబర్ని అందించాలనే ఉద్దేశ్యంతోనే కేంద్రం అమ్మాయిల పెళ్లి వయస్సు పెంచిందని సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సీపీఐ 97వ అవతరణ దినోత్సవంలో నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమ్మాయిల వివాహ వయస్సు 21 సంవత్సరాలు పెంచడం కంటే చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తేవాలని డిమాండ్ చేశారు.
-------
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆదివారం లేఖ రాశారు. చెరకు రైతుల బకాయిలను చెల్లించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని లేఖలో డిమాండ్ చేశారు. చెరకు రైతులకు పరిశ్రమల యాజమాన్యాలు రూ 120 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. విశాఖ జిల్లా తాండవలో ఒక రైతు మరణించారని చెప్పారు.ఆందోళన చేపట్టిన చెరుకు రైతులపై పలుచోట్ల పోలీసులు అక్రమ కేసులు పెట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
---------
నెల్లూరు జిల్లాలో యథేచ్ఛగా అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని సంగం మండలం తిరమనతిప్పపై జోరుగా అక్రమ గ్రావెల్ తవ్వకాలతో స్థానికులు తిప్పలు పడుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం తో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు గుత్తేదారులకు వత్తాసు పలుకుతున్నారని మండిపడుతున్నారు. మూడు జేసీబీ మిషన్లు, పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లతో జోరుగా అక్రమంగా గ్రావెల్‌ని తరలిస్తున్నారు.
-----------
సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రచ్చబండ కార్యక్రమంపై కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఈ పరిస్థితి చోటు చేసుకుంది. రచ్చబండ కార్యక్రమానికి ఏర్పాట్ల చేసేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలను టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు.ఎర్రవల్లిలో కాంగ్రెస్ రచ్చబండ నిర్వహించవద్దని టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రెండు పార్టీల్లోని నాయకులు పోటాపోటీగా నినాదాలు చేశారు.
-----------
ములుగు జిల్లాలోని వెంకటాపురం 39 సీఆర్పీఎఫ్ బెటాలియన్‌లో కాల్పులు కలకలం రేపాయి. సీఆర్ఫీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉమేష్‌చంద్రపై కాల్పులు జరిపాడు. అనంతరం తాను కూడా అదే తుపాకీతో కాల్చుకున్నాడు. ఈ ఘటనలో ఎస్ఐ ఉమేష్ చంద్ర అక్కడికక్కడే మృతి చెందగా...తమిళనాడుకు చెందిన హెడ్ కానిస్టేబుల్ స్ఠీఫెన్ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో స్థానిక కానిస్టేబుళ్లు స్టీఫెన్‌ను హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
---------
కొవిడ్-19 వేరియంట్లను తట్టుకుని ఆరోగ్యంగా ఉండేందుకు దేశ ప్రజలకు బూస్టర్ డోస్ ఇవ్వాలని తాను చేసిన సూచనని మోదీ ప్రభుత్వం అంగీకరించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. మోదీ ప్రభుత్వం వేసిన ఒక మంచి అడుగు ఇదేనని, దీంతో దేశ ప్రజలందరికీ వ్యాక్సీన్ అందనుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశంలో జనవరి 3 నుంచి టీకా కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని, ఈసారి బూస్టర్ డోస్‌ను కూడా అందించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోది శనివారం ప్రకటించారు.
---------
కర్ణాటకలో నాయకత్వ మార్పుపై చర్చలు వాస్తవమేనని అయితే ముఖ్యమంత్రి రేసులో తాను లేనని, తానే సీఎం అంటూ ఎక్కడా చెప్పలేదని భారీ పరిశ్రమలశాఖ మంత్రి మురుగేశ్ నిరాణి తెలిపారు. మంత్రివర్గ మార్పు అంశం ముఖ్యమంత్రి నిర్ణయానికి చెందినదన్నారు. పార్టీ జాతీయ నేతలు, రాష్ట్రానికి చెందిన ముఖ్యులు నిర్ణయిస్తారన్నారు. తాను ఎక్కడా సీఎం అవుతానని చెప్పలేదన్నారు. ఇలాంటి ప్రచారం ఎందుకు జరుగుతోందో తెలియదన్నారు.


