ఏపీ పరువు గోవిందా.. జగన్ పై ఉద్యోగుల వార్.. శ్రీలక్ష్మికి షాక్.. టాప్ న్యూస్@7PM
Published on: Fri Nov 12, 2021 7:01PM
పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా తమను మోసం చేశారని ఏపీజేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు అన్నారు. పీఆర్సీ సహా ఉద్యోగుల ఆర్థికపరమైన అంశాలపై అధికారులు ఏర్పాటు చేసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఉద్యోగ సంఘాలు బహిష్కరించాయి. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు లక్షలాది మంది ఉద్యోగులకు ఏం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
----------
దేశంలో ఆంధ్రప్రదేశ్ పరువు పోయింది. ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు ఇండియన్ మెడికల్ డివైసెస్ రెడ్ నోటీసులను జారీ చేసింది. మెడికల్ ఉపకరణాలను ఏపీకి సరఫరా చేయవద్దని ఐఎండీ ఇండస్ట్రీ ఆదేశాలు జారీ చేసింది. ఏపీఎంఎస్‌ఐడీసీకి పరికరాలు ఎవరు సరఫరా చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది. నాలుగు సంవత్సరాల నుంచి ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని సమాఖ్య తెలిపింది. సంప్రదింపులు జరిపినా ఉపయోగం లేదని సమాఖ్య పేర్కొంది
---------
అదనపు రుణం అర్హతను ఏపీ కోల్పోయింది. మూలధనం వ్యయం లక్ష్యాలను చేరుకోవడంలో ఏపీ వెనకబడింది. రాష్ట్రంలో ఆస్తులను సృష్టించడంలో ఏపీ వెనకబడింది. దీంతో అదనపు రుణాన్ని ఏపీ పొందలేకపోయింది. రెండో త్రైమాసికంలో మూలధనం వ్యయం లక్ష్యాలను చేరుకున్న 7 రాష్ట్రాలకు ఎఫ్ఆర్బీఎంకు అదనంగా 16,691 కోట్లు రుణం పొందేందుకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. తెలంగాణ రూ.5392 కోట్ల అదనపు రుణం పొందనుంది.
----------
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. శుక్రవారం కుప్పంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లుగా ఈ నియోజకవర్గానికి అధికారపార్టీ నేతలు ఎవరూ రాలేదని, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని, ఈ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు వైసీపీకి లేదన్నారు.
---------
ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఏపీ, కర్నాటక సరిహద్దు వివాదం తేలేంతవరకూ తనపై ఉన్న ఓబులాపురం మైనింగ్ కేసుపై దర్యాప్తును నిలిపివేయాలని శ్రీలక్ష్మి పిటిషన్ దాఖలు చేసుకున్నారు. కేసు విచారణను తొమ్మిదేళ్లుగా సీబీఐ సాగదీస్తుందంటూ శ్రీలక్ష్మి తరపు న్యాయవాది రంజిత్ కుమార్ వాదించారు. అదనపు చార్జిషీట్లు దాఖలు చేయాలని సీబీఐ జాప్యం చేస్తుందని లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. శ్రీలక్ష్మి పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గతంలో శ్రీలక్ష్మి పిటిషన్‌ను హైకోర్టు కూడా తోసిపుచ్చింది
---------
ఎమ్మెల్సీ ఎన్నికల్లో 11 మంది అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది.విజయనగరం నుంచి ఇందుకూరి రఘురాజు, విశాఖ వంశీకృష్ణ యాదవ్, వరదు కల్యాణి, తూర్పుగోదావరి స్థానిక కోటాలో అనంత విజయభాస్కర్, కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురాం, మొండితోక అరుణ్, గుంటూరు నుంచి మూరుగుడు హనుమంతరావు, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, చిత్తూరు స్థానిక కోటాలో కృష్ణ రాఘవ భరత్, అనంతపురం స్థానిక కోటాలో వై.శివరామిరెడ్డి, ప్రకాశం స్థానిక కోటాలో తూమాటి మాధవరావులను ప్రకటించారు.
-----------
బీజేపీ నేత బండి సంజయ్ కాదు తొండి సంజయ్ అన్నారు కేటీఆర్. బండి సంజయ్‌ను గెలిపించినోళ్లకి ఓ దండం అన్నారు. ఇలాంటి పిచ్చోళ్లని పార్లమెంట్‌కి పంపించారన్నారు. హిందూ-ముస్లిం పేరుతో ఆగం చేయటమే బీజేపీ పని’’ అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడదని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. సిరిసిల్లలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు.
-----------
రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్యర్యంలో ఈ నెల 14 నుంచి 21 వరకు కాంగ్రెస్ జన జాగరణ ప్రజా చైతన్య పాదయాత్ర ఉంటుందని ఏఐసీసీ కార్యనిర్వహణ కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అన్ని చోట్ల కాంగ్రెస్ నేతలు జిల్లా కలెక్టర్ల పర్మిషన్లు తీసుకొని యాత్రలు చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌కు లోబడి ఈ యాత్ర ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు అనుమతులు ఇవ్వకుంటే గాంధీ భవన్లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.
----------
దేశ నిర్మాణంలో విధిగా ప్రాణాలు అర్పించిన ఐపిఎస్ అమరవీరుల అత్యున్నత త్యాగం, కీలక పాత్రను స్మరించుకుంటూ ఈ దేశ సేవలో అంకితమైన ఒక జట్టుగా, కుటుంబంగా కలిసి పనిచేయాలని అధికారి ట్రైనీలకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 73వ బ్యాచ్ ఐపిఎస్ ప్రొబేషనర్స్ పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దోవల్ హాజరయ్యారు.
-----
కొవిడ్-19 అనంతరం దేశంలో సైబర్ నేరాల రేటు 500 శాతం పెరిగిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. శుక్రవారం 14వ హ్యాకింగ్ మరియు సైబర్ సెక్యూరిటీ అనే అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. చాలా కాలంగా సైబర్ నేరాల పెరుగుదల గురించి అనేక వార్తా కథనాలు వస్తూనే ఉన్నాయి.


