TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నిధులు గోల్.. కేసీఆర్ క‌న్నీరు.. వైసీపీ రికార్డింగ్ డ్యాన్సులు.. టాప్‌న్యూస్ @1pm

Published on: Tue Feb 15, 2022 12:09PM

1. ఏపీలో ఉపాధి నిధులు 261 కోట్లు దుర్వినియోగం అయ్యాయని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ప్రకటించడం రాష్ట్రంలో పెరిగిపోయిన అవినీతికి నిదర్శనమని టీడీపీ అధినేత చంద్ర‌బాబు విమ‌ర్శించారు. పేదలకు చేరాల్సిన నిధులను అధికార పార్టీకి చెందిన నేతలు మింగేస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటు ఆస్తులు లాక్కోడానికే ఆటోనగర్‌లోని స్థలాలపై ప్రభుత్వం జీవో జారీ చేసిందని త‌ప్పుబ‌ట్టారు. ఉపాధి చూపకపోగా, ఉపాధి మార్గాలను కూడా  మూసివేస్తున్నారన్నారు చంద్ర‌బాబు. 

2. కడప జిల్లా జైలర్‌ వరుణారెడ్డిని బదిలీ చేయాలంటూ సీబీఐ డైరెక్టర్‌కు టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. వివేకా హత్య కేసు నిందితుల ప్రాణాల భద్రత దృష్ట్యా బదిలీ కోరుతూ లేఖ రాశారు. గతంలో అనంతపురం జిల్లా జైలర్‌గా వరుణారెడ్డి పని చేసిన‌ప్పుడు.. మొద్దు శ్రీను తన జైలు గదిలోనే హత్యకు గురయ్యారని లేఖ‌లో గుర్తు చేశారు. 

3. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ హక్కు అని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. హోదా అంశం ముగిసిన అధ్యాయం అని చెప్పి బీజేపీ మోసం చేసిందని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేనలకు ప్రత్యేక హోదా ఇచ్చే..తెచ్చే శక్తి లేదన్నారు. ప్రధానిగా రాహుల్ తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైలు పైనే అని స్పష్టం చేశారు. మాట మీద నిలబడే పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అని తులసిరెడ్డి అన్నారు.

4. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కపట నాటకాలు కట్టిపెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చ‌రించారు. కేంద్ర త్రిసభ్య కమిటీ అజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించటంలో జీవీఎల్ కేలక పాత్ర పోషించారని ఆరోపించారు. బీజేపీ ద్వంద్వ వైఖరిని.. జీవీఎల్ రెండు నాల్కల ధోరణి తీవ్రంగా ఖండించారు. 

5. "మొసలి కన్నీరు" కార్చడమనేది ఒక ఆర్ట్.. అందులో కేసీఆర్‌ మాస్టర్ డిగ్రీ చేశారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. ప్రధాని మోదీ ‘తెలంగాణ తల్లి’ని, మన అమరవీరుల త్యాగాలను అవమానించినప్పుడు కేసీఆర్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారని అన్నారు. ‘కేసీఆర్‌ను ఎప్పుడూ నమ్మవద్దు’ అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు.

6. అసోం సీఎం హిమంత బిస్వాశర్మ‌పై హైద‌రాబాద్‌లో కేసు నమోదు అయ్యింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అసోం సీఎం అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. సీఎం హిమంత‌పై మూడు సెక్షన్‌ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

7. హిందూపురంలో వైసీపీ నేతల ఆధ్వర్యంలో రికార్డింగ్ డ్యాన్సులు జోరుగా సాగుతున్నాయి. డ్యాన్సర్లతో అదికార పార్టీ నేతలు చిందులు వేస్తున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. హిందూపురంలో ఎల్ఆర్జీ విద్యా సంస్థల అధినేత బాలకృష్ణన్ విగ్రహావిష్కరణకు వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ అహ్మద్‌తో పాటు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, స్థానిక వైసీపీ నేతలు హాజరయ్యారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయ‌గా.. వైసీపీ నేతలు ఒక్కసారిగా స్టేజ్ పైకి ఎక్కి డ్యాన్సర్లతో చిందులు వేశారు. వైసీపీ నేతల తీరును అంతా విమర్శిస్తున్నారు. 

8. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఎన్టీపీఎస్ ద‌గ్గ‌ర జెన్కో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కృష్ణపట్నం ఫ్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జగన్ హామీలను నమ్మి గెలిపించామని.. ఈరోజు తాము రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు చేసే పరిస్థితికి తీసుకొచ్చారని మండిప‌డ్డారు. కృష్ణపట్నం ఫ్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే.. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలతో భారీగా భారం పడుతుందన్నారు. 

9. గుంటూరు జిల్లా దాచేపల్లిలో తుపాకులు కలకలం రేపాయి. తెలంగాణలో మద్యం అమ్ముకునే విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఓ వర్గం వారు తుపాకులతో బెదిరించిన‌ట్టు తెలుస్తోంది. దాచేపల్లిలో తుపాకుల ఘటన పల్నాడులో చర్చనీయాంశంగా మారింది.

10. మేడారం మహా జాతరలో మంగళవారం తొలి ఘట్టం జరగనుంది. పగిడిద్దరాజును పెళ్లికొడుకుగా ముస్తాబు చేసి మేడారం తీసుకువచ్చే తంతు జరగనుంది. మహబూబాబాద్ జిల్లా, గంగారం మండలం, పూనుగొండ్ల నుంచి కోయ పూజారులు గోవిందరాజును పెళ్లికొడుకుగా తయారు చేస్తారు. ప్రత్యేక పూజల అనంతరం మేడారానికి తీసుకువస్తారు. కాలినడకన బయలుదేరి బుధవారం సాయంత్రానికి మేడారం చేరుకుంటారు. సారలమ్మ సహా బుధ‌వారం గద్దలపైకి గోవిందరాజు వస్తారు.