TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విభ‌జ‌న క‌మిటీ.. కేసీఆర్‌కు రోజా కితాబు.. మేడారంలో హెలికాప్ట‌ర్‌.. టాప్‌న్యూస్@1pm

Published on: Sat Feb 12, 2022 12:13PM

1. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం దృష్టి సారించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కమిటీలో కేంద్రం తరపున హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఆశిష్ కుమార్ నేతృత్వం వహించనున్నారు.  తెలంగాణ నుంచి రామకృష్ణారావు, ఏపీ నుంచి ఎస్.ఎస్.రావత్ సమావేశంలో పాల్గొంటారు. ప్రతి నెల త్రిసభ్య కమిటీ సమావేశం అవుతుందని కేంద్ర హోంశాఖ తెలిపింది. 

2. విశాఖ ఉక్కు సంకల్పానికి నేటితో ఏడాది పూర్తైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుర్తు చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ, అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకూ టీడీపీ నిరసన గళాన్ని వినిపిస్తూనే ఉందని చెప్పారు. విశాఖ ఉక్కుని కాపాడటానికి సీఎం జగన్ రెడ్డి, వైసీపీ ఎంపీలు కనీస ప్రయత్నం చెయ్యకుండా చేతులెత్తేయడం దారుణమన్నారు లోకేశ్. 

3. ఎమ్మెల్సీ అశోక్ బాబుని ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీలు మంతెన సత్యనారాయణరాజు త‌దిత‌రులు పరామర్శించారు. అశోక్‌బాబు అరెస్ట్‌తో జగన్ రెడ్డి రాక్షసత్వం మరోసారి బయటపడిందన్నారు కేశినేని నాని. ‘‘ఎన్ని అక్రమ కేసులు పెట్టుకున్నా మాకు భయం లేదు. స్వతంత్ర పోరాటంలో జైలుకెళ్లినట్లే ప్రజా సమస్యలపై పోరాటంలో జైలుకెళ్తున్నారు. జైలుకెళ్తున్న తెలుగుదేశం నేతలెవ్వరూ జేబులు కొట్టి, ప్రజాధనం దోచుకుని వెళ్లట్లేదు’’ అని అన్నారు.

4. టీడీపీపై విషప్రచారం చేయడమే కొడాలి నాని పనిగా పెట్టుకున్నారని మండిప‌డ్డారు బోండా ఉమా. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే టీడీపీ అడ్డుకుంటోందని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కొడాలి నానికి తన శాఖలో ఉన్న తప్పులు, లెక్కలపై కనీస అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. కేసినో పెట్టి.. మహిళలతో డ్యాన్స్‌లు వేయించిన నానిపై కేసు ఎందుకు పెట్ట‌లేద‌ని నిల‌దీశారు. 

5. కల్వకుంట్ల రాజ్యాంగం కావాలో.. అంబేద్కర్‌ రాజ్యాంగం కావాలో ప్రజలు తేల్చుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు ఇచ్చారు. తన అవినీతిపై విచారణ ప్రారంభమైందనే సీఎం కేసీఆర్ ఫ్రస్టేట్ అవుతున్నారని అన్నారు. దళితబంధు టీఆర్ఎస్ రాబంధుల చేతుల్లో బందీ అయ్యిందని.. ఢిల్లీ కోట కాదు.. తన కుటుంబ కోట బద్దలు కాకుండా కేసీఆర్ చూసుకోవాలన్నారు బండి సంజ‌య్‌. 

6. ఢిల్లీ కోటలు బద్దలు కొట్టుడు కాదు.. ముందు రాష్ట్రంలో ఆగమైతున్న రైతులను నిలబెట్టాలన్నారు వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల‌. రోజుకిద్దరుగా ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘మోదీని దేశం నుంచి తరుముడు ఏమో గానీ... నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరమకుండా చూస్కో.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

7. యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ అద్బుతంగా నిర్మాణం చేస్తున్నారని నగిరి ఎమ్మెల్యే రోజా కొనియాడారు. శనివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి రోజా దర్శించుకున్నారు. ఆల‌య నిర్మాణానికి రాయిని గుంటూరు నుంచి తీసుకు వచ్చారని, ఎప్పటికీ తెలుగువారు అన్నదముళ్లు, అక్కచెల్లెలుగా కలిసి ఉంటారని రోజా అన్నారు.

8. కడప జిల్లా జమ్మలమడుగులో వైసీపీ నేతల ఆదేశాల‌తో అధికారులు ఓవ‌రాక్ష‌న్ చేశారు. టీడీపీ హయాంలో ఇళ్ల‌ దగ్గర ఉన్న పాత ఇసుకపై దాడులు నిర్వహించారు. భారీ పోలీసు బందోబస్తు మ‌ధ్య‌.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇసుకను తరలించ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

9. గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచిలో టీడీపీ ఫెక్సీలను వైసీపీ వ‌ర్గీయులు చించేయ‌డంతో ఉద్రిక్త‌త త‌లెత్తింది. దుండ‌గులు ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ జెండా పెట్టారు. గత కొద్ది రోజులుగా గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం తొలగించాలని వైసీపీ ఎమ్మెల్యే పట్టుబడుతుండ‌టంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

10. తెలంగాణ‌లో జ‌రిగే మేడారం జాతరలో ఆదివారం నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. హనుమకొండ నుంచి మేడారానికి హెలికాప్టర్‌ను నడుపనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కొక్కరికి వెళ్లి వచ్చేందకు టికెట్ ధర 19,999గా నిర్ణయించింది. మేడారంలో హెలికాప్ట‌ర్‌ జాయ్ రైడ్‌కు 3700 వ‌సూలు చేయ‌నున్నారు. ఒక ట్రిప్‌లో ఆరుగురు వెళ్లేందుకు అవకాశం ఉంది.