TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిరు గుడ్‌న్యూస్‌.. హెచ్ఆర్ఏ టెన్ష‌న్‌.. క‌రోనా అప్‌డేట్స్‌.. టాప్‌న్యూస్‌@7pm

Published on: Thu Jan 13, 2022 5:17PM

1. ఏపీ ప్రభుత్వం నుంచి పది రోజుల్లో సినీ పరిశ్రమకు శుభవార్త వస్తుందని జ‌గ‌న్‌తో భేటీ అనంత‌రం చిరంజీవి చెప్పారు. ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విభాగాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. జీవో 35 గురించి పునరాలోచిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు చిరంజీవి చెప్పారు. తాను ఇండస్ట్రీ పెద్దగా రాలేదని, ఇండస్ట్రీ బిడ్డగా వచ్చానని చిరంజీవి అన్నారు. 

2. ఏపీలో హెచ్‌ఆర్ఏ వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. సీఎంఓ అధికారులతో ఉద్యోగ సంఘాల నేతలు మరోసారి చర్చలు జరిపారు. ప్రస్తుత హెచ్ఆర్ఏ విధానాన్నే కొనసాగించాలని ఉద్యోగ సంఘాలు ప‌ట్టుబ‌డుతున్నాయి. కొత్త పీఆర్సీ వద్దని, పాత పీఆర్సీని కొనసాగించమ‌ని డిమాండ్ చేస్తున్నాయి. 

3. టీడీపీ నేత చంద్రయ్య హత్యను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. ప్రశ్నిస్తున్న వారిని భయపెట్టేందుకే వైసీపీ హత్యాకాండకు పాల్పడుతోందని మండిపడ్డారు. పల్నాడులోనే ఇప్పటికే పదుల సంఖ్యలో రాజకీయ హత్యలు జరిగాయన్నారు. చంద్రయ్య కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. 

4. కుప్పంలో టీడీపీ శ్రేణులపై వైసీపీ కక్ష సాధింపు చర్యలు చేపడుతోంది. టీడీపీ నేత గోపీనాథ్‌కు చెందిన మెడికల్ షాప్‌ను అధికారులు మూసివేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో మెడికల్ షాప్‌ యజమాని కుమారుడు టీడీపీ తరపున కౌన్సిలర్‌ అభ్యర్థిగా బరిలోకి దిగాడు. వైసీపీ నేతలు ఒత్తిడి చేసి తన షాపుని సీజ్ చేయించారంటూ బాధితుడు ఆరోపించారు. 

5. ‘బండి సంజయ్‌కు దమ్ముంటే కేసీఆర్, కేటీఆర్ మీద చేయి వెయ్యమనండి.. ప్రజలే ఉరికించి కొడతారు. అరెస్ట్ చేయిస్తామని ఒకడు.. జైలుకు పంపిస్తామని ఒకడు పిచ్చికుక్కల్లా మాట్లాడుతున్నారు’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బీజేపీ నేత‌ల‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఎరువుల విషయంలో బీజేపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు.

6. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఉచిత ఎరువులు ఇస్తామన్న మీ మాట ఉత్తదైపోయింది. చివరి గింజ వరకు కొంటానన్నది ఊసే లేకుండా పోయింది. ఇప్పుడు ఎరువుల ధరలు పెరిగాయి అని రైతుల మీద ప్రేమ పొంగుకొచ్చినందుకు చాలా సంతోషం దొరగారు. కానీ కేంద్రం మెడలు వంచుతామంటే నమ్మాలా?’’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు.

7. నకిలీ కాల్ సెంటర్ ముఠాను అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ‘‘అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను ముఠా క్లోనింగ్ చేస్తోంది. మొహాలీ, పంజాబ్‌కి చెందిన ఏడుగురు ముఠాను సైబారాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాకి చెందిన నవీన్ బొటాని కీలక సూత్రధారిగా ఉన్నాడు. ఇప్పటి వరకూ 50 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డారు’’ అని వెల్లడించారు.

8. ఏపీలో కొత్తగా ఒక్క‌రోజులోనే 4,348 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రస్తుతం 14,204 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. సంక్రాంతి మూడు రోజులు ప్ర‌జ‌లు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచిస్తున్నారు. 

9. పండ‌గ సీజ‌న్‌లో మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ రాష్ట్రాల సీఎంల‌కు ప్ర‌ధాని మోదీ దిశానిర్దేశం చేశారు. వంద‌శాతం వ్యాక్సినేష‌న్‌పై దృష్టి పెట్టాల‌ని పిలుపు ఇచ్చారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా సమావేశం అయ్యారు. రాష్ట్రాల వారీగా పరిస్థితిని సమీక్షించారు. 

10. టీమ్‌ఇండియా టెస్ట్ కెప్లెన్ విరాట్‌ కోహ్లీ మరో ఘనత సాధించాడు. టెస్టుల్లో వందో క్యాచ్‌ అందుకున్నాడు. వికెట్‌ కీపర్లు కాకుండా ఈ రికార్డు సాధించిన ఆరో టీమ్‌ ఇండియా ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. టీమ్‌ఇండియా తరఫున అత్యధికంగా రాహుల్‌ ద్రవిడ్‌ 209 టెస్టు క్యాచ్‌లు అందుకున్నాడు. హైదరాబాద్ స్టైలిష్‌ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ 135 క్యాచ్‌లతో రెండో స్థానంలో నిలిచాడు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌ 115 క్యాచ్‌ల‌తో ఆ త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు.