TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిరుకు చురుకులు.. నైట్ క‌ర్ఫ్యూ వాయిదా.. సంక్రాంతి ఎప్పుడు? టాప్‌న్యూస్ @7pm

Published on: Tue Jan 11, 2022 5:37PM

1. 2009లో చిరంజీవి పార్టీ పెట్టకుంటే అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్లమని చంద్ర‌బాబు అన్నారు. చిరంజీవి పార్టీ పెట్టకముందు, తర్వాత కూడా తనతో బాగానే ఉన్నారని చెప్పారు. సినిమా టికెట్ల వివాదంలోకి టీడీపీని కూడా లాగుతున్నారని.. టీడీపీకి సినీ పరిశ్రమ సహకరించింది లేదని తెలిపారు. తాను సీఎంగా ఉన్నప్పుడు, ఈ మధ్య కూడా తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారని చంద్రబాబు గుర్తు చేశారు. 

2. జగన్‌రెడ్డి సంస్థల్లో అక్రమ పెట్టుబడులు లేవంటూ ఐటీ శాఖ క్లియరెన్స్ ఇచ్చిందన్న వార్తలపై చంద్రబాబు స్పందించారు. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా జగన్ రూ.1200 కోట్లు తన సంస్థల్లోకి తెచ్చుకోవడం అవినీతి కాదా? అని.. ఐటీ శాఖకు ట్యాక్స్ కడితే చాలా? అవినీతి లేనట్టేనా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖలు ఇలా వ్యవహరిస్తే అక్రమార్కులకు రాజకీయం ఒక వ్యాపారం అవుతుందన్నారు చంద్ర‌బాబు. 

3. టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను, ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌రిచేందుకు.. "చైతన్య రథం" పేరుతో తెలుగుదేశంపార్టీ ఈ-పేపర్‌ను ప్రారంభించింది. స్వతంత్రంగా పనిచేసే మీడియాపై వైసీపీ ప్రభుత్వం వేటు వేసిందని.. మీడియా సంస్థలకు కూడా కులముద్ర వేసి వేధిస్తున్నారని  చంద్రబాబు మండిప‌డ్డారు. టీడీపీకి ఉన్న 70 లక్షల మంది కార్యకర్తలకు సమాచారం చేరవేసేలా ‘చైతన్య రథం’ ఈ-పేపర్‌ను తీర్చిదిద్దుతామ‌న్నారు. 

4. బీహార్ ప్ర‌తిప‌క్ష నేత‌, ఆర్జేడీ లీడ‌ర్‌, లాలూ వార‌సుడు తేజ‌స్వి యాద‌వ్.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను క‌లిశారు. త‌న‌తో పాటు మ‌రో న‌లుగురు ఆర్జేడీ ఎమ్మెల్యేల‌ను వెంటేసుకొని.. చార్టెడ్ ఫ్లైట్ లో హైద‌రాబాద్ వ‌చ్చారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో కేసీఆర్‌తో మంత‌నాలు జ‌రిపారు. 

5. ఎన్ని కూటములు కట్టినా సీఎం కేసీఆర్‌ జైలుకు వెళ్లక తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. కేసీఆర్‌, ఆయ‌న‌ కుటుంబం అవినీతిపై విచారణలు జరుగుతాయని బండి మ‌రోసారి గ‌ట్టిగా చెప్పారు. ఆయ‌న‌పై జ‌ర‌గ‌బోయే విచారణల భయం వల్లే జాతీయ కూటమి అంటూ కేసీఆర్ కొత్త నాటకాలు ఆడుతున్నారని మండిప‌డ్డారు. గడీల పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించడమే బీజేపీ లక్ష్యమన్నారు. పోరాటంలో వెనక్కి తగ్గవద్దని ప్రధాని మోదీ ఫోన్‌ చేసి చెప్పారని బండి సంజ‌య్‌ తెలిపారు. 

6. రైతు ఆత్మహత్యలపై కేటీఆర్‌కు దమ్ముంటే చర్చకు రావాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్‌ పాలనలో అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అందుకేనా రైతు సంబరాలు? అని ప్రశ్నించారు. మద్యం ఆదాయాన్ని భారీగా పెంచుకుంటున్నారని.. ఏడేళ్లలో కేసీఆర్ తాగుబోతులకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని విమర్శించారు. తులసి వనంగా ఉన్న రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

7. ఏపీలో ఒక్క‌రోజులోనే పాజిటివ్ కేసులు డ‌బుల్ కావ‌డం ఆందోళ‌న‌ల‌కు గురి చేస్తోంది. గ‌డిచిన 24 గంటల్లో కొత్తగా 1,831 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో ప్రస్తుతం 7,195 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 467, విశాఖ జిల్లాలో 295, కృష్ణా జిల్లాలో 190, గుంటూరు జిల్లాలో 164, నెల్లూరులో 129, అనంతపురం జిల్లాలో 161 కొవిడ్‌ కేసులు వ‌చ్చాయి. సంక్రాంతి ముంద‌ర ఇంత వేగంగా కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు బెదిరిపోతున్నారు. 

8. ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం దిగొచ్చింది. నైట్ క‌ర్ఫ్యూ అమ‌లును కాస్త వాయిదా వేసి.. సంక్రాంతి త‌ర్వాత నుంచి అమ‌లు చేయ‌నున్న‌ట్టు ఉత్త‌ర్వులు స‌వ‌రించింది. కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ సోమవారం నుంచి.. జ‌న‌వ‌రి 31 తేదీ వ‌ర‌కూ రాత్రి కర్ఫ్యూ అమ‌లు చేయ‌నుంది ఏపీ స‌ర్కారు. నైట్ కర్ఫ్యూ నుంచి కొన్నింటికి మినహాయింపు ఇస్తూ జీవో జారీ చేసింది.

9. ఏపీ ప్ర‌భుత్వం సంక్రాంతి పండ‌గ సెల‌వుల‌ను మారుస్తూ తాజాగా ఉత్త‌ర్వులు ఇచ్చింది. ఇంత‌కుముందు 14, 15, 16 తేదీల‌ను సెల‌వులుగా ప్ర‌క‌టించగా.. ఆ డేట్స్ స‌వ‌రిస్తూ.. 13, 14, 15 తేదీల‌ను సంక్రాంతి సెల‌వులుగా వెల్ల‌డిస్తూ జీవో విడుద‌ల చేసింది. 16న‌ ఆదివారం కావ‌డంతో.. ఏపీలో వ‌రుస‌గా నాలుగు రోజులు సెల‌వులు రానున్నాయి.  

10. తెలుగు రాష్ట్రాలు 15వ తేదీని సంక్రాంతిగా ప్రకటించడం బాధాకరమని ప్ర‌ముఖ పంచాంగ కర్త శ్రీనివాస్ గార్గేయ అన్నారు. జనవరి 14 మధ్యాహ్నం 2.29 నిమిషాలకు మకర సంక్రమణమని కచ్చితంగా చెబుతున్నారు. పితృ దేవతలకు పిండ ప్రదానాలు చేయవలసినది 14 తేదీ మాత్రమేనని, ప్రభుత్వాలు తమ నిర్ణయం మార్చుకుని 14వ తేదీని మకర సంక్రాంతిగా ప్రకటించాలని సూచించారు.