TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వెంక‌న్న‌కు అవార్డు.. పీఆర్సీ ఫ‌స‌క్.. హే జిన్నా.. స‌ఫారీలు స‌ఫా.. టాప్‌న్యూస్@7pm

Published on: Thu Dec 30, 2021 5:49PM

1. ప్రజాకవి, జానపద గాయకుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వ‌రించింది. ‘వల్లంకి తాళం’ కవితా గేయ రచనకు వెంకన్నకు అవార్డు ల‌భించింది. 2021 సంవత్సరానికి కవిత్వ విభాగంలో ఆయ‌న‌ ఎంపికయ్యారు. గోరటి వెంకన్నకు లభించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తెలంగాణ మట్టి మనిషికి దక్కిన గౌరవంగా సీఎం కేసీఆర్ అభివర్ణించారు. 

2. ప్రభుత్వం చర్చల పేరుతో తమను అవమానించిందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. ఏదైనా నేరుగా సీఎం జగన్‌తో భేటీలోనే తేల్చుకుంటామని ఉద్యోగ సంఘాలు పట్టుబట్టాయి. జనవరి 3న స్ట్రగుల్‌ కమిటీ భేటీలో కార్యాచరణ ప్రకటిస్తామని ప్రకటించాయి.

3. టీడీపీ నేత వంగవీటి రాధాతో ఆ పార్టీ నాయకులు గద్దె రామ్మోహ‌న్‌రావు, బోడే ప్రసాద్‌ భేటీ అయ్యారు. విజయవాడలోని రాధా నివాసంలో వారి మధ్య గంటకు పైగా సమావేశం జరిగింది. భద్రతపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాధాకి టీడీపీ నేతలు సూచించారు. మ‌రోవైపు, వంగవీటి రాధా ఆఫీస్ దగ్గర మూడు రోజులుగా స్కూటీ పార్క్ చేసి ఉండ‌టం కలకలం రేపింది. 

4. ఏపీలో ఏ సమయంలోనైనా ఎన్నికలు రావచ్చని టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల‌క్ష‌న్స్‌కు అంతా సిద్దంగా ఉండాలని టీడీపీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈసారి టీడీపీకి 151 సీట్లకుపైగా రావాలని.. తెలుగుదేశం జెండా చూస్తే వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాలన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటానని రామ్మోహ‌న్ నాయుడు హామీ ఇచ్చారు.

5. గుంటూరు జిన్నా ట‌వ‌ర్‌కు ఆ పేరు తొల‌గించి.. అబ్దుల్ క‌లాం లేదా గుర్రం జాషువా పేరు పెట్టాల‌ని బీజేపీ నేత స‌త్య‌కుమార్‌ డిమాండ్ చేశారు. ఆయ‌న‌కు వీర్రాజు, విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డిలు వంత‌పాడారు. తెలంగాణ‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. జిన్నా పేరు తీసేస్తారా? లేక‌, ట‌వ‌ర్‌నే కూల్చేయ‌మంటారా? అంటూ మ‌రింత కాక రేపారు. 

6. రైతుల ఆత్మహత్యలతో తెలంగాణ‌లో మరణ మృదంగం మోగుతోందని.. వెంట‌నే రైతుల‌ను ఆదుకోవాలంటూ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. వ‌రి, మిర్చి పంట నష్టంతో ఆత్మహత్యలకు పాల్ప‌డుతున్నార‌ని.. రైతుల ప్రాణాలంటే కేసీఆర్ ప్రభుత్వానికి గడ్డిపోచతో సమానంగా కనిపిస్తున్నాయని ఆరోపించారు. 

7. తెలంగాణ‌లో ర్యాలీలు, సభలను జనవరి 2 వరకు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఆంక్షలు అమలు అవుతాయన్నారు. న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలన్నారు డీజీపీ. 

8. న్యూఇయ‌ర్ వేడుక‌ల్లో భాగంగా పబ్‌ల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తాగి వాహనం నడిపితే పబ్‌ నిర్వాహకులదే బాధ్యత అని హైకోర్టు స్పష్టం చేసింది. పబ్‌లలో జంటలు, మైనర్లకు అనుమతిని నిరాకరించాలని తెలిపింది. 

9. తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించగా తమిళ స్మగ్లర్లు తారస‌పడ్డారు. టాస్క్ ఫోర్స్ బృందాన్ని చూసి ఎర్రచందనం దుంగలను వదిలేసి పారిపోయారు. 40 లక్షల విలువైన 23 ఎర్రచందనం దుంగలను పోలీసులు సీజ్ చేశారు.

10. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 305 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 191 పరుగులకు ఆలౌటై పరాజయం పాలైంది.