TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అశోకయుద్ధం.. పార్కు ఫ‌స‌క్‌.. డ్ర‌గ్స్ ద‌డ‌ద‌డ‌.. టాప్‌న్యూస్ @1pm

Published on: Fri Feb 11, 2022 12:17PM

1. ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును అర్థ‌రాత్రి సీఐడీ పోలీసులు అరెస్టు చేయ‌డం ఏపీలో తీవ్ర క‌ల‌క‌లం చెల‌రేగుతోంది. అశోక్‌బాబు వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీవోగా పని చేసి రిటైర్‌ అయ్యారు. డిగ్రీ చదవకుండానే చదివినట్లుగా చూపించారని ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయనపై ఆరోపణలు రాగా.. విజిలెన్స్‌ అధికారులు విచారణ జరిపి.. అశోశ్‌బాబుపై అభియోగాలను ఉపసంహరించారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలోనే ఆ కేసు ‘క్లోజ్‌’ అయ్యింది.  

2. పీఆర్సీపై రగడ రగులుతున్న సమయంలోనే అశోక్‌బాబుపై వైసీపీ ప్రభుత్వం మరోమారు పాత ఆరోపణలను బయటికి తీసింది. తమకు అందిన ఫిర్యాదు మేరకు.. విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐడీకి లోకాయుక్త సూచించింది. దీంతో సీఐడీ వెంటనే కేసు నమోదు చేయ‌గా.. తాజాగా అశోక్‌బాబును అరెస్ట్ చేసింది. మ‌రోవైపు, అశోక్‌బాబుకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలైంది. 

3. ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్టును ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. అశోక్ బాబు అరెస్ట్‌పై కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని తప్పుడు కేసులపై న్యాయ పోరాటం చేస్తామని చంద్రబాబు చెప్పారు. 
 
4. ఎమ్మెల్సీ అశోక్ బాబు సతీమణితో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్లో సంభాషించారు. కనీస సమాచారం ఇవ్వకుండా ఇంటికి వెళ్తున్న మార్గం మధ్యలో ఆపి అరెస్ట్ చేసి తీసుకెళ్లారని లోకేష్‌కు అశోక్ బాబు సతీమణి  వివరించారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని లోకేష్ భరోసా ఇచ్చారు. 

5. అశోక్ బాబును అర్ధరాత్రి అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని టీడీపీ నేత దేవినేని ఉమా ఆరోపించారు. రఘరామ కృష్ణమరాజును కొట్టినట్లు అశోక్ బాబుని సైతం కొట్టాలని చూస్తున్నారన్నారు. తప్పు చేయలేదు కాబ‌ట్టే ఆయ‌న ముందస్తు బెయిల్ తీసుకోలేదన్నారు ఉమా. సీఐడీ కార్యాలయంలోకి వెళ్లాల‌ని చూసిన దేవినేనిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. 

6. బెజవాడలోని బెర్మ్ పార్కును పర్యాటక అభివృద్ధి సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు తాకట్టు పెట్టింది. ఐదెకరాల విస్తీర్ణం కలిగిన ఈ పార్కును తనఖా పెట్టి రూ. 143 కోట్లు అప్పుగా తీసుకుంది. నాలుగైదు రోజుల్లో తొలివిడతగా రూ. 35 కోట్లు విడుదల కానున్నాయి.

7. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహ కార్యక్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ వివాహంలో మంత్రి కేటీఆర్తో కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు స‌న్నిహితంగా మాట్లాడ‌టం రాజ‌కీయంగా ఆస‌క్తి రేపుతోంది. ఇద్దరూ పక్క పక్కనే కూర్చొని ఫోటోలు దిగారు. ఇక‌, కేటీఆర్‌తో ఫోటోలు దిగేందుకు వైసీపీ నేతలు, పెళ్లికి హాజరైన కార్యకర్తలు పోటీ పడ్డారు. 

8. టాలీవుడ్ డ్రగ్స్ కేసు వివరాల కోసం ఎక్సైజ్‌కు మరోసారి ఈడీ లేఖ రాసింది. నిందితులు, సాక్షుల వాంగ్మూలాలు, కాల్ డేటా, డిజిటల్ రికార్డులు కావాలని కోరింది. ఈడీ వివరాలు, డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని ఇటీవల ఈడీ హైకోర్టుకు తెలిపింది. కేసుకు సంబంధించిన రికార్డులన్నీ ఈడీకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎక్సైజ్‌కు మరోసారి ఈడీ లేఖ రాసింది.

9. కృష్ణపట్నం పవర్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వీటీపీఎస్ ఉద్యోగులు కార్యాలయం గేటు ముందు ధర్నాకు దిగారు. ఏపీ జెన్‌కోని కొన్ని ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పే విధానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే మెరుపు సమ్మెకు దిగడానికి కూడా వెనకాడబోమని  ఏపీ జెన్‌కో విద్యుత్ జేఏసీ నాయకులు హెచ్చరించారు. 

10. ఏపీలో వైద్య ఆరోగ్య శాఖ బదిలీల్లో గందరగోళం నెలకొంది. ట్రాన్స్‌ఫర్స్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించగా.. ఆన్‌లైన్‌లో బదిలీల కోసం రూపొందించిన వెబ్‌సైట్ స‌రిగా లేదు. ఈ వెబ్ సైట్‌కు పోటీగా డూబ్లీకేట్ వెబ్ సైట్ క్రియేట్ కావ‌డంతో వైద్యులు అయోమయానికి గురవుతున్నారు. రెండు పోర్టులు ఓపెన్ కావడంతో.. ఏది నిజమో, ఏది నకిలీదో అర్దం కావడంలేదని వైద్యులు ఆవేదన చెందుతున్నారు.