వైసీపీలో చేరిన కమెడియన్ అలీ.. అక్కడినుంచే పోటీ

 

కొద్దిరోజులు క్రితం సినీ నటుడు అలీ ఏ పార్టీలో చేరతాడా? అని ఏపీ రాజకీయాల్లో తెగ చర్చలు జరిగాయి. ఆయన పలువురు పార్టీ అధినేతలతో వరుసగా భేటీ అవ్వడమే ఆ చర్చలకు దారి తీశాయి. గతంలో అలీ ముందుగా వైస్ జగన్ తో.. తరువాత చంద్రబాబుతో, పవన్ కళ్యాణ్ తో వరుసగా భేటీ అయ్యారు. దీంతో ఆయన ఏ పార్టీలో చేరతారో అర్థంగాక అందరూ తలలు పట్టుకున్నారు. అయితే అలీ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు. ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికే చేరినట్లుగా.. ముందుగా భేటీ అయిన జగన్ వైపే అలీ మొగ్గుచూపారు. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

సోమవారం ఉదయం వైఎస్ జగన్‌ తో నటుడు అలీ భేటీ అయ్యారు. సుమారు పావుగంట సేపు మాట్లాడిన అనంతరం అలీ కండువా కప్పుకున్నారు. అలీకి పార్టీ కండువా కప్పి వైఎస్ జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. టికెట్‌పై జగన్‌ నుంచి స్పష్టమైన హామీ రావడంతో అలీ వైసీపీలో చేరినట్లు తెలుస్తోంది.

టీడీపీ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో తాను పార్టీ మారుతున్నట్లు అలీ మీడియాకు వెల్లడించారు. జగన్‌ మాట ఇస్తే తప్పరన్నారు. వైసీపీ గెలుపుకోసం కృషి చేయాలని జగన్‌ కోరారని చెప్పారు. రాజమండ్రి లేదా విజయవాడ నుంచి టికెట్‌ ఇస్తే పోటీ చేస్తానని తెలిపారు. జనసేనలో ఎందుకు చేరలేదన్న విలేకర్ల ప్రశ్నకు ‘రాజకీయాలు వేరు.. ఫ్రెండ్‌షిప్‌ వేరు’ అని సమాధానమిచ్చారు.