TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మా బండినే ఆపుతారా.... టోల్ గేట్ సిబ్బందిపై...ఎమ్మెల్యే అనుచరులు దాడి!

Published on: Sat Apr 25, 2026 7:33PM

 

అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టోల్ ఫీజు చెల్లింపు విషయంలో ప్రారంభమైన వివాదం కాసేపట్లోనే ఘర్షణకు దారి తీసింది. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు టోల్ సిబ్బందిపై దాడికి దిగినట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, టోల్ గేట్ వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని ఆపడంతో ఆగ్రహానికి గురైన అనుచరులు “మా బండినే ఆపుతారా?” అంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ వాగ్వాదం క్రమంగా హింసాత్మకంగా మారి, టోల్ బ్యారియర్‌ను ఎమ్మెల్యే గన్‌మ్యాన్ విరగ్గొట్టినట్లు చెబుతున్నారు.

ఈ ఘటనలో టోల్ ప్లాజా మేనేజర్ రవి సహా పలువురు సిబ్బందిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. మహిళా సిబ్బందిని కూడా వదలకుండా దాడి చేయడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. కొంతమంది మహిళలను జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక మేనేజర్ రవిని కొట్టి బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లినట్లు సమాచారం రావడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఘటన సమయంలో టోల్ ప్లాజా వద్ద వాహనాల రాకపోకలు కొంతసేపు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, ప్రజాప్రతినిధుల ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి