'ప్రకాశం' కోల్పోయిన పొగాకు రైతు
Published on: Mon Feb 20, 2012 9:35AM
ప్రకాశం
జిల్లా: ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు తమకు ఇక ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. ఇటీవల అకాలవర్షాలు పొగాకు పంటను తీవ్రంగా దెబ్బతీశాయి. ముదురు తోటలు పనికి రాకుండా పోయాయి. క్యూరింగ్ లో ఎక్కువగా మాడు ఆకు వస్తోంది. కనీసం కాల్పు ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క బ్యారన్ కింద 7 నుంచి 10 ఎకరాల దాకా పొగాకు సాగుచేస్తారు. బ్యారన్ కు ఒక పచ్చాకు కొట్టకు, తోటల్లో ఆకు వలిచి కర్రలకు అల్లడం చేసే పచ్చి ముటాకు క్యూరింగ్ కలప, బ్యారన్ డ్రైవర్, బ్యారన్ ల అద్దె, గ్రేడింగ్ ఖర్చులు చూస్తే దాదాపు రూ.30వేల దాకా పెట్టుబడులవుతాయి. అయితే వీరికి రూ.16 వేల నుంచి రూ20 వేల ఆదాయం మాత్రమే వస్తోంది. ఒక్కో కొట్టుకు రూ.6 వేలు దాకా నష్టాలు వస్తున్నాయి. ఇక పొగాకు సాగుకు సంబంధించి సేద్యం, నారు, ఎరువులు, నాట్లు, నీళ్ళు వంటి ఖర్చులున్నాయి.ఇవి ఎకరానికి దాదాపు రూ.10వేలు అవుతుంది. ఇది కూడా కలుపుకుంటే తమకు నష్టాలు మరింత పెరుగుతాయని రైతులు అంటున్నారు. ఇప్పటికే జిల్లాలో అనేక మంది పొగాకు రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. వీరంతా తమకు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు.


