చిరు పదవుల కోసం వైట్ అండ్ సీ !
Published on: Tue Jan 3, 2012 1:25PM
హైదరాబాద్
: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి కేంద్ర మంత్రి పదవి, ఆయన వర్గం నేతలకు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో పదవులు ఎప్పటి నుండో ఊరిస్తున్నాయి.అయితే చిరంజీవితన వర్గం శాసనసభ్యులకు మంత్రి పదవులు ఇప్పించుకోవాలంటే మరో మూడు వారాలు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది!కాంగ్రెసు పెద్దలు, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ఇతర కాంగ్రెసు నేతలు చిరంజీవి వర్గానికి మంత్రివర్గంలో సాధ్యమైనంత త్వరగా చోటు కల్పించాలని చెబుతున్నప్పటికీ మరో ఇరవై రోజుల వరకు అందుకు అవకాశం లేనట్లుగా కనిపిస్తోంది. చిరంజీవికి ఇటీవల గంటా శ్రీనివాస రావు, సి.రామచంద్రయ్యను కిరణ్ మంత్రివర్గంలోకి తీసుకోవాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చినప్పటికీ, స్థానికంగా ఆ నేతలపై ఉన్న వ్యతిరేకత, కేసులు తదితర కారణాల వల్ల చివరి నిమిషంలో దానికి బ్రేక్ పడింది. దీంతో చిరు క్యాడర్‌లో నిరుత్సాహం కనిపించింది.
మూడో వారం వరకు శూన్య మాసం ఉంది. శూన్యమాసంలో పదవులు పంపిణీ మంచిది కాదని కాంగ్రెసు నేతలు కొందరు భావిస్తున్నారట. ఇప్పటి వరకు ఆగిన వారు మరో ఇరవై రోజులు ఆగితే బావుంటుందని చెబుతున్నారట. ఈ నేపథ్యంలో ఈ నెల 24 తర్వాతే మంత్రి వర్గ విస్తరణకు అవకాశం దొరుకుతుంది. వచ్చే నెల మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఆ లోగానే చిరు వర్గాన్ని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు మాపు అంటూ వస్తున్న పదవులు శూన్యమాసం పూర్తయ్యాక బడ్జెట్ సమావేశాలలోగానైనా చిరు వర్గాన్ని వరిస్తాయా చూడాలి!


