ఎన్నికలను ఎదుర్కొనే సత్తా లేదు:కొండా సురేఖ
Published on: Mon Jan 2, 2012 2:30PM
చిత్తూ
రు: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవికి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తే ఆ స్థానం లో కాంగ్రెసు పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే సత్తా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేదని అందుకే ఆయన చిరుకు పదవి రాకుండా అడ్డుకుంటున్నారని వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యే కొండా సురేఖ చిత్తూరు జిల్లాలో అన్నారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ చిరుకు మంత్రి పదవి ఇవ్వాలని అడుగుతున్నప్పటికీ కిరణ్ అడ్డు తగులుతున్నారన్నారు. ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం కాంగ్రెసు ప్రభుత్వానికి లేదని దీంతో అర్థమవుతోందన్నారు. అంతేకాకుండా విప్ ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వేసిన తమపై ఓటమి భయంతోనే వేటు వేయడం లేదన్నారు.ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో జగన్ విజయం ఖాయమన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు జగన్ తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతారని ఎమ్మెల్సీ కొండా మురళీధర రావు అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన పల్లెకు పోదం కార్యక్రమంలో కొండా దంపతులు పాల్గొన్నారు. కాగా ఓడిపోతామన్న భయంతోనే ఉప ఎన్నికల ఫలితాలు రిఫరెండం కాదని ముఖ్యమంత్రి అన్నారని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఏలూరులో అన్నారు. కడపలో ఎదురైన పరాభవమే కాంగ్రెసుకు కొనసాగుతుందన్నారు. అందుకే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను జరపడం లేదన్నారు.


