తిరుపతిలో ఎన్నికల ప్రచారం చాలా హాట్ గురూ ...
Published on: Tue May 15, 2012 10:32AM
తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికలు ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలతో వేడెక్కింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్సా, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి రాకతో తారాస్థాయికి చేరిన ప్రచారం ఘాటైన విమర్శలతో ఓటర్లను ఆకట్టుకునే దిశగా సాగింది. కాంగ్రెస్, తెలుగుదేశం, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలు ఎవరికీ తీసిపోని స్థాయిలో ఒకరిపై ఒకరు ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఘాటైన పదజాలంతో దుమ్మెత్తిపోస్తున్నాయి.
సిఎం కిరణ్ ను, పీసీసీ చీఫ్ బోత్సాని, రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని తెలుగుదేశం, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నేతలు మంటెక్కే మాటల తూటాలతో విమర్శించారు. ఈ విమర్శల్లో జగన్ ను నేరరాజకీయా చరిత్ర ఉన్న నేతగా చూపేందుకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కృషి చేశాయి. అలానే సిఎం కిరణ్ కు జగన్ కు మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయనీ, అందుకే జగన్ ను మాటలతోనే విమర్శిస్తున్నారానీ తెలుగుదేశం అధికార ప్రతినిధి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు.
సామాజిక న్యాయం పేరిట ప్రజారాజ్యం పార్టీని ఢిల్లీకి తాకట్టుపెట్టిన చిరంజీవి తిరుపతి కోసం చేసిందేమీ లేదనీ ఆయన అంటున్నారు. గాంధీభవన్ ను బ్రాందీభవన్ గా మార్చిన ఘనుడు బొత్సా అంటూ ఆయనకు గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకూ లిక్కర్ డాన్ పాత్ర ఉందని ముద్దు తన మాటల తూటాలను వదిలారు. ఈయనతో పాటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి కూడా అసలు చిరంజీవికి మానవత్వమే లేదన్నారు. దీనికి ముందు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మాట్లాడుతూ తిరుపతిలో చదలవాడను గెలిపిస్తే అస్సలు అందుబాటులో ఉండే సమస్యే లేదన్నారు. జగన్ ఎంతకైనా తెగిస్తాడని సిఎం కిరణ్ తిరుపతి ఓటర్లను హెచ్చరించారు.
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను నమ్మరాదన్నారు. వారిద్దరి వల్లే తిరుపతి అభివృద్ధిలో వెనుకబడి ఉందన్నారు. రోజుకో ఘాటైన విమర్శలతో తమకు ఇక రేపే ఎన్నికలన్నట్లు వాతావరణం కనిపిస్తోందని ఓటర్లు అంటున్నారు. కాంగ్రెస్ నేతలే కాకుండా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మరికొందరు నేతలు అలాగే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధినేత జగన్, లక్ష్మీపార్వతి తదితరులు పర్యటనలు పూర్తయినందున ఎన్నికల వేడి తమను తాకుతోందని వారు తెలిపారు. కొత్త కొత్త విమర్శలకు పార్టీలు కసరత్తులు చేస్తున్నందున ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఎవరేమంటారో అన్న ఆసక్తి నియోజకవర్గంలో నెలకొందని ఓటర్లు అభిప్రాయపడుతున్నారు.


