చదలవాడ అభ్యర్థిత్వం భేష్!
Published on: Wed Apr 11, 2012 10:49AM
తిరుపతి ఉప ఎన్నికకు తెలుగుదేశంపార్టీ తరపున చదలవాడ కృష్ణమూర్తిని అభ్యర్థిగా ఎంపిక చేయడం సముచితమనే భావన తిరుపతి ప్రజలలో వ్యక్తం అవుతోంది. తిరుపతి నగరంలో కాపు సామాజికవర్గం సంఖ్యాపరంగా ఎక్కువగా వుంది. ఈ కారణంగానే చిరంజీవి తిరుపతి నుంచి విజయం సాధించారు. తమ సామాహికవర్గానికి చెందిన చిరంజీవి రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతించడంతోపాటు ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా ఈ వర్గం ప్రజలు ఏకపక్షంగా ఆయనకు ఓట్లు వేశారు. అయితే రాష్ట్రంలో ప్రజారాజ్యం అధికారంలోకి రాకపోవడం, చిరంజీవి తాము ఊహించినంతగా ప్రజలతో మమేకం కాకపోవడం వారికి నిరుత్సాహాన్ని కలిగించింది. అంతేకాకుండా గెలుపోటములతో సంబంధం లేకుండా సొంతపార్టీతో ఆత్మగౌరవం నిలుపుటాడని భావిస్తున్న తరుణంలో ప్రజారాజ్యంపార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం కూడా ఈ సామాజికవర్గంలో కొంతమందిని నిరుత్సాహపరిచింది.
ఈ నేపథ్యంలో తెలుగుదేశంపార్టీ కాపు సామాజికవర్గానికి చెందిన చదలవాడ కృష్ణమూర్తిని తొలిగా అభ్యర్థిగా ప్రకటించడం భేష్ అయిన నిర్ణయంగా భావిస్తున్నారు. చదలవాడ కృష్ణమూర్తి గతంలో వివాదరహిత శాసనసభ్యునిగా గుర్తింపు పొందారు. చిరంజీవి పట్ల మోజుతో వ్యవహరించారు కానీ వాస్తవంలో చదలవాడ పట్ల వ్యతిరేకత లేదు. ఈ స్థితిలో ఉప ఎన్నికల్లో చదలవాడ ముందుకు రావడం వల్ల మరల అతనిని ప్రజలు ఆదరించే అవకాశం వున్నట్టు తిరుపతి ప్రజలు అభిప్రాయపడుతున్నారు.


