తిరుమాడ వీధుల్లో పందులు

పరమ పవిత్రమైన తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట అపచారం జరిగింది. ఆలయం ఎదుట, తిరుమాడ వీధుల్లో పందుల మంద సంచరించడంతో భక్తులు ముక్కున వేలేసుకున్నారు. నిన్న ఉదయం 6 గంటల సమయంలో 7 వరాహాల మంద శ్రీబేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి కిందకు దిగి ఆలయం ఎదుట వరకు వచ్చాయి. ఇక్కడి నుంచి దక్షిణ మాడవీధి గుండా పరుగులు పెట్టాయి. నిత్యం శ్రీనివాసుడు విహరించే ఈ ప్రాంతాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. అందుకే ఇక్కడ పాదరక్షలతో భక్తుల సంచారాన్ని నిషేధించింది. అలాంటి చోట పందులు తిరగడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగంలోకి దిగిన టీటీడీ నిఘా, ఆరోగ్య విభాగం పందులను పట్టుకునే పనిలో పడ్డాయి.