టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ... కొత్త ఈవోగా ఆ అధికారికి ప్రమోషన్..
Published on: Thu Oct 1, 2020 9:31AM
మూడు సంవత్సరాలకు పైగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న అనిల్ కుమార్ సింఘాల్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను అక్కడి నుండి తప్పించి హెల్త్, మెడికల్ మరియు కుటుంబసంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. అయన స్థానంలో ప్రస్తుతం టీటీడీ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న ఏవీ. ధర్మారెడ్డిని పూర్తిస్థాయిలో ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
1993 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన అనిల్ కుమార్ సింఘాల్‌ను 2017 మే నెలలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం టీటీడీ ఈవోగా నియమించింది. అయితే ఆయనను టీటీడీ ఈవోగా నియమించడం పైన అప్పట్లో విమర్శలు వచ్చాయి. అప్పటివరకు సహజంగా తెలుగువారు లేదా దక్షిణాది ఐఏఎస్ అధికారిని మాత్రమే ఆ పదవిలో నియమించేవారు. అయితే మొదటిసారి ఉత్తర భారతదేశానికి చెందిన అధికారిని నియమించడంతో అప్పట్లో తెలుగు ఐఏఎస్ అధికారుల్లో అసంతృప్తి వ్యక్తం అయింది. ఇది ఇలాఉండగా టీటీడీ ఈవో గా సింఘాల్ రెండేళ్ల పదవీకాలం 2019లో ముగియగా.. వైసీపీ ప్రభుత్వం ఆయన్ను ఈవోగా కొనసాగిస్తూ అప్పట్లో నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డిని కొద్దీ రోజులలో టీటీడీ ఈవోగా నియమించవచ్చని వార్తలు వస్తున్నాయి.


