TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కేసులో సిట్ దర్యాప్తు వేగం.. నెక్ట్స్ నోటీసులు ఎవరికి?

Published on: Thu Jun 5, 2025 10:53AM

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం  పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూ ప్రసాదం లో వినియోగించే నెయ్యి కలుషితం అంశంపై  సుప్రీంకోర్టు తీర్పు మేరకు సీబీఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది. ఈ సిట్ విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.  అలిపిరి సమీపంలో  కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని మరీ సిట్  తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై దర్యాప్తు చేస్తున్నది.  ఈ విచారణలో  భాగంగా వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా దాదాపు 15 మందిని సిట్ అదుపులోనికి తీసుకుని పలు దఫాలు విచారించింది.

 లడ్డూ కల్తీ విషయం లో గతంలో టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి కి పీఎస్ గా ఉన్న అప్పన్న ను తాజాగా అదుపులోనికి తీసుకుంది. అప్పన్న ద్వారా లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో పలు రకాల వ్యవహారాలు జరిగాయని సిట్ ప్రాథమికంగా గుర్తించింది. ఈ కల్తీ వ్యవహారంలో అప్పన్న పాత్ర ఏమిటి?  అప్పన్నతో పాటు ఈ వ్యవహరాంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది అన్న కోణంలో గత మూడు రోజులుగా సిట్ అధికారులు అప్పన్నను విచారిస్తున్నారు.

ఈ విచారణలో భాగంగా అప్పన్న ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా త్వరలో టీటీడీ మాజీ చైర్మన్లు  వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, అప్పటి ఈవో ధర్మారెడ్డి కి, అప్పటి టీటీడీ జేఈవోలు, ఇతర అధికారులకు సిట్ నోటీసులు ఇచ్చి వాచారించే అవకాశాలున్నాయని అంటున్నారు.  అలాగే తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కేసుకు సంబంధించి త్వరలో మరి కొందరిని అరెస్టు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.  ఈ కేసుకు సంబంధించి సిట్ ఇప్పటికే ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సిట్ దర్యాప్తు వేగంతో రానున్న రోజులలో ఎవరెవరికి నోటీసులు అందుతాయి, ఇంకెతంత మంది అరెస్టౌతారు, అసలీ కల్తీ వ్యవహారంలో కీలక పాత్రధాలు, సూత్రధారులు ఎవరు అన్నది త్వరలో తేలిపోతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.