తిరుపతి మీద అంత రచ్చెందుకు రమణా!

 

తెలుగువాడికి, ఆ మాటకి వస్తే దక్షిణాదికి ఇలవేల్పు వెంకన్న దేవుడే! అందుకే తిరుమలలో ఏం జరిగినా సంచలనమే! ఒక పూట భక్తులు రాకపోయినా వార్తే, ఒక పూట భక్తులు కిటకిటలాడినా వార్తే! వెంకన్న దర్శనం కోసం ఎన్ని కంపార్టుమెంట్లు నిండాయో కూడా ఓ వార్తే! అందుకే వెంకన్నని ప్రత్యక్షంగా సేవ చేసుకునే పూజారులకి కూడా సెలబ్రెటీ స్టేటస్‌ ఉంటుంది. కానీ ఆ పదవికి వన్నె తేవడం పోయి, వివాదాలు సృష్టించడం మొదలైపోయింది. ఈ సంప్రదాయానికి ముందుగా డాలర్‌ శేషాద్రి నాంది పలికారని చెప్పుకోవచ్చు. కాస్త పేరున్నవ్యక్తులు తిరుమలకు రాగానే పరుగుపరుగున వారికి స్వాగతాలు పలకడం, దగ్గరుండి వారికి దర్శనం చేయించడం, ప్రైవేటుగా పూజలు నిర్వహించడం లాంటి పనులతో శేషాద్రివారు తరచూ వార్తల్లోకి ఎక్కేవారు. అందుకే తిరుమల ఊరేగింపుల్లో పాల్గొనే భక్తులు, స్వామివారి ఉత్సవ విగ్రహం తర్వాత శేషాద్రినే ఆసక్తిగా గమనించేవారు.

 

ఇక శేషాద్రి పరపంరని కొనసాగిస్తూ రమణ దీక్షితులు కూడా నిత్యం వార్తల్లో నిలవడం మొదలుపెట్టారు. మనవడిని గర్భగుడిలోకి తీసుకువెళ్లడం, కొడుకులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం, స్వామి సేవలకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లాంటి సంచలనాలకు తెరతీశారు. చివరికి ప్రభుత్వం తనని తొలగించడంతో ఏకంగా ప్రభుత్వం మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. పదేళ్లకు ముందు జరిగిన సంఘటలన్నీ ఏకరవు పెట్టి, తిరుమలలో ఘోరమైన అపచారాలు జరుగుతున్నాయనే అనుమానాలను ప్రజల్లో రేకెత్తించారు.

 

రమణ దీక్షితులు చేసిన ఆరోపణల్లో స్వామివారికి చెందిన ఓ వజ్రం మాయమైందనీ, వెయ్యి కాళ్ల మండపాన్ని అన్యాయంగా కూల్చేశారని చెప్పిన విషయాలు ముఖ్యమైనవి. విచిత్రంగా ఇవన్నీ ఆయన ప్రధానార్చకునిగా ఉన్న సమయంలోనే జరిగాయి. వీటికి సంబంధించిన దర్యాప్తులలో ఆయన మాటలని స్వయంగా రికార్డు చేయడం జరిగింది. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు వ్యక్తం కావడం ఓ విచిత్రం. ఈ ఆరోపణలు చేసే ముందు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాను కలిసిరావడం, రమణ దీక్షితులకి బీజేపీ పార్టీ వంత పలకడం కూడా అనుమానాస్పదంగానే కనిపిస్తోంది. ఇక ఇలాంటి అదను కోసమే కాచుకున్న వైకాపా సంగతి చెప్పనే అక్కర్లేదు. తిరుమల విజ్రాలు సాక్షాత్తు చంద్రబాబు ఇంట్లోనే ఉన్నాయనీ, వాటిని విదేశాలను మళ్లించేస్తున్నారనీ విజయసాయిరెడ్డి రకరకాల ఆరోపణలతో చెలరేగిపోయారు.

 

జరుగుతున్న పరిణామాలతో వెంకన్న మీద భక్తుల నమ్మకం ఇసుమంతైనా తగ్గదు. కానీ అక్కడి పరిపాలనతో ఏదో లోటు జరుగుతోందనీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తిరుమల మీద సరైన పట్టు లేదనీ ప్రజలలో దురభిప్రాయం ఏర్పడే అవకాశం లేకపోలేదు. రమణ దీక్షితుల మీద క్రిమినల్‌ కేసు పెట్టినంత మాత్రాన ఈ సమస్య తీరదు. తితిదే నివేదికలు, దర్యాప్తులు, ఆస్తిపాస్తుల వివరాలు అన్నీ ప్రజలకు అందుబాటులో ఉంచాలి. పాలన పారదర్శకంగా ఉన్నప్పుడే ప్రజల మనసులో అనుమానాలు రాకుండా ఉంటాయి. లేకపోతే ఇప్పుడు రమణ దీక్షితులు, రేపు మరొకరు తమ వ్యక్తిగత కోపాన్ని తీర్చుకునేందుకు వెంకన్న ప్రతిష్టనే దిగజార్చేయగలరు.