తిరుమలపై చినజీయర్ వ్యాఖ్యలు
Published on: Wed Jan 11, 2012 1:57PM
వి
జయవాడ: తిరుమల విషయంలో చిన జీయర్ స్వామి బుధవారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిన జీయర్ స్వామి తిరుమలలో అన్ని ఉల్లంఘనలే జరుగుతున్నాయన్నారు.సౌకర్యాలు, భద్రత, పెద్దల పేరుతో నియమాలు ఉల్లంఘించడం న్యాయం కాదన్నారు.టిటిడి, ప్రభుత్వాల తీరుపై విమర్శలు గుప్పించారు. దేహం చాలిస్తే కొండపై ఎలాంటి సంస్కారాలు చేయవద్దని, శేషాచలవాసుడు అందుకు అంగీకరించడన్నారు. నియమాలు ఉల్లంఘించడమంటే దేవుడిని అవమానించడమేనని ఆగ్రహించారు. ఇలాంటి ఉల్లంఘనలకు క్షమించాలని శరణాగత దీక్షలో దేవుడిని కోరదామన్నారు. ఫిబ్రవరి మూడో తేదిన కొండపైకి నడుచుకుంటూ వెళతానని చెప్పారు. కాగా చిన జీయర్ స్వామి శిష్యులు అహోబిళ స్వామి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తిరుమలపై ప్రభుత్వానిది భస్మాసుర హస్తమన్నారు. శ్రీవారికి విశ్రాంతి ఇవ్వకుండా దర్శనాలు చేయించడం సరికాదన్నారు. మూసిన తలుపులు తెరిచి దర్శనాలు చేయించడం శోచనీయమన్నారు. కాగా ఇటీవల చిన జీయర్ స్వామి తిరుమలకు వెళితే పబ్‌కు వెళ్లినట్లుగా ఉన్నదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై అప్పుడు పలువురు మండిపడ్డారు.


