డబ్బే కాదు... సమయం కూడా కావాలి!

ఈ రోజుల్లో చాలామందిది ఒకటే బాధ! ఖర్చుపెట్టుకోవడానికి కావల్సినంత డబ్బు ఉంది. కానీ గడపడానికి సమయమే ఉండటం లేదు. ఈ మాటలు వింటున్న కొందరు పరిశోధకులకి ఓ అనుమానం వచ్చింది. మనిషి దేనివల్ల సంతోషంగా ఉంటాడు? డబ్బు వల్లా! కాలం వల్లా! ఈ విషయాన్ని తేల్చుకునేందుకు వారు ఒక ఆరు పరిశోధనలు చేశారు. ఇందులో భాగంగా 4,600 మంది అభ్యర్థుల ఆలోచనా తీరుని గమనించారు.

 

లక్షలకొద్దీ జీతంతో ఎక్కువసేపు ఉద్యోగం చేయడం కంటే, కాస్త తక్కువ జీతంతో తక్కువ పనిగంటలు చేస్తేనే సుఖంగా ఉన్నట్లు ఈ పరిశోధనలో వెల్లడయ్యింది. కుర్రవాళ్లు కాస్త అటూఇటూగా మొగ్గుచూపారు కానీ, వయసు మీరుతూ జీవితం తెలిసొస్తున్న కొద్దీ.... డబ్బుకంటే సమయమే ముఖ్యం అనేవారి సంఖ్యే ఎక్కువగా ఉందట. అంతేకాదు! ఇంటిపని, పెరడు పని చేసేందుకు పనివాళ్లని పెట్టుకున్నప్పుడు కూడా ఇదే తరహా సంతోషం కనిపించింది. ఆ సంతోషం తన పని వేరొకరు చేయడం వల్ల కాదు, జీవితాన్ని ఆస్వాదించే సమయం దక్కినందువల్లే అని తేల్చారు!

 

పైన చెప్పుకొన్న పరిశోధన జరిగి ఏడాది గడిచిపోయింది. ఇప్పుడు శాస్త్రవేత్తలకి మరో సందేహం వచ్చింది. మన డబ్బుతో వస్తువులు కొనుక్కుంటే ఎంతో కొంత తృప్తి ఉంటుంది. అదే సమయాన్ని కొనుక్కుంటే! అదేనండీ... ఆ డబ్బుతో మన పనిభారం తగ్గించుకుంటే మరింత తృప్తి ఉంటుందా! అన్న ఆలోచన వచ్చింది. వెంటనే కొంతమందికి తలా 40 డాలర్లు ఇచ్చి చూశారు. ఈ డబ్బుని మీకు తోచిన రీతిలో ఏదన్నా కొనుక్కోమని చెప్పారు. సహజంగానే చాలామంది తమకి ఇష్టమైన వస్తువులని కొనేసుకున్నారు. అతికొద్ది మంది మాత్రమే... తమకి కాలం కలిసొచ్చేలా వేరొకరి సేవల కోసం ఈ డబ్బుని వినియోగించుకున్నారు. వస్తువులని కొన్నవారితో పోలిస్తే సమయాన్ని కొనుక్కున్నవారే ఎక్కువ తృప్తి పడినట్లు తేలింది.

 

ఈ పరిశోధనలతో రెండు విషయాలు స్పష్టం అయిపోతున్నాయి. ఒకటి- జీవితంలో డబ్బు ఎంత అవసరమో, సమయం అంతే అవసరం. ఈ రెండింటి మధ్యా సమన్వయం లేకపోతే మనసుకి లోటు తోచడం ఖాయం. రెండు- ప్రతి పైసా కూడపెట్టాలన్న తపనకి పోకుండా, అవసరం అయినప్పుడు సేవల కోసం కూడా కాస్త డబ్బుని ఉపయోగించుకోవడం మంచిది. అలా కలిసొచ్చే కాలం మనం వదులుకునే డబ్బుకంటే విలువైనది!

- నిర్జర.