“హలో...ఇది భూమండలమేనా?”
Published on: Sat Dec 26, 2015 7:04AM
.jpg)
మొన్న గురువారం నాడు లండన్ లో నివసిస్తున్న ఒక మహిళకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలివైపు నుండి “హలో...ఇది భూమండలమేనా?” అనే ప్రశ్న వినబడటంతో ఆమెకు ఏమి సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు. అంతలోనే ఆ ఫోన్ కాల్ కట్ అయిపోయింది. ఆమె ఏమనుకొని ఉంటుందో తేలికగానే ఊహించవచ్చును.
ఆమెకు వచ్చిన ఆ ఫోన్ కాల్ ఈ భూమండలం మీద నుండి వచ్చిన ఫోన్ కాల్ కాదు కనుకనే అటువంటి ప్రశ్న వినబడింది. భూమికి 400 కిమీ దూరంలో అంతరిక్షంలో ఏర్పాటు చేయబడిన అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుండి టిమ్ పీక్ అనే వ్యోమగామి తన కుటుంబానికి ఫోన్ చేయబోయి పొరపాటున వేరే నెంబరుకి చేసి “హలో ఇది భూమండలమేనా?” అని అడగటంతో అది వార్త అయ్యింది. ఆరునెలల పాటు అంతరిక్షంలో ప్రయోగాలు చేయడానికి క్రిందటి నెలే టిమ్ పీక్ అంతరిక్షంలోని అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి చేరుకొన్నాడు.
తను పొరపాటున రాంగ్ నెంబరుకి చేసినట్లు గుర్తించిన టిమ్ పీక్ “ఆమెకు ఫోన్ చేసి “హలో...ఇది భూమండలమేనా?” అని అడిగినందుకు క్షమాపణలు చెప్పుకొంటున్నాను. పొరపాటున రాంగ్ కాల్ చేసాను తప్ప ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదు,” అని ఒక ట్వీట్ మెసేజ్ కూడా పెట్టడంతో ఈ విషయం ఈ భూమండలంలో ఉన్నవారందరికీ ఈ విషయం తెలిసింది.


