TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బిగుసుకుంటున్న ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు.. సిట్ ముందుకు ప్రభాకరరావు

Published on: Mon Jun 2, 2025 11:02AM

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు.. కీలక దశకు చేరుకుంది.  ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావు... ఈనెల 5న సిట్ విచారణకు హాజరుకాబోతుండటంతో  ఈ కేసు దర్యాప్తు ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. గత 14 నెలలుగా అమెరికాలో ఉంటున్న ప్రభాకరరావు,  సుప్రీం కోర్టు ఆదేశాలతో ఇండియాకు తిరిగి వస్తున్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఆయన అత్యున్నత న్యాయస్థానానికి హామీ పత్రం కూడా ఇచ్చారు.  వన్ టైమ్ ఎంట్రీ పాస్‌పోర్ట్‌ జారీ అయిన వెంటనే ఆయన ఇండియా బయల్దేరుతారు. పాస్‌పోర్ట్‌ అందిన మూడు రోజుల్లో దేశానికి తిరిగి రావాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈనెల 5న సిట్ విచారణకు హాజరవుతున్నట్టు దర్యాప్తు బృందానికి సమాచారం ప్రభాకర్‌రావు ఇచ్చారు.

బీఆర్ఎస్ హయాంలో  ఎస్ఐబీ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పంజాగుట్ట పోలీసులు గత ఏడాది మార్చి 10న కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావే.  ఈ కేసు విచారణకు ముదే అమెరికా వెళ్లిపోయిన ప్రభాకరరావు. అక్కడే ఉండిపోవడానికి చేయగలిగినన్ని ప్రయత్నాలు చేశారు. అవేమీ కుదరకపోవడంతో యాంటిసిపేటరీ బెయిలు ఇస్తేనా భారత్ కు తిరిగి వస్తానంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.  దీంతో ఆయన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం ను ఆశ్రయించారు.  సుప్రీం కోర్టు ఆయనకు స్వల్ప ఊరటనిస్తూ విచారణకు సూర్తిగా సహకరించాలన్న షరతుతో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సుప్రీం ఆదేశాల మేరకు ఆయన భారత్ కు వచ్చి సీటి్ విచారణకు హాజరు కానున్నారు. ఇక ఆయనను విచారించడానికి సిట్ అధికారులు రెడీగా ఉన్నారు.   ఏ ప్రశ్నలు అడగాలి..  ఎలాంటి సమాచారం సేకరించాలనే అంశంపై దృష్టి పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు అధికారులు, ప్రైవేట్ వ్యక్తి శ్రవణ్‌రావు మధ్య లింక్ ఎలా కుదిరింది?  ఎవరి ఆదేశాలతో ఫోన్లను ట్యాప్ చేశారు? ఆ సమాచారాన్ని ఎవరెవరికి చేరవేశారు? అన్న ప్రశ్నలను సిట్ ప్రభాకరణావుకు సంధించే అవకాశా లున్నాయంటున్నారు.  ఫోన్ ట్యాపింగ్ నిబంధనలను పాటించారా..? హార్డ్‌డిస్క్‌లను ఎందుకు ధ్వంసం చేశారు? ఎవరి ఆదేశాలతో వాటిని నాశనం చేశారు?  వంటి ప్రశ్నలతో ప్రభాకరరావును సిట్ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉందంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అరెస్టైన వారి నుంచి తీసుకున్న వాంగ్మూలం ఆధారంగా సిట్ అధికారులు ప్రభాకరరావును విచారించనున్నారు. మొత్తం మీద ఈ కేసులో విశ్రాంత ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావుకు ఉచ్చు గట్టిగానే బిగిసినట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గతంలో పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.  ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రేవంత్ సీఎం కావడం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి దర్యాప్తునకు ఆటంకాలు కలిగించే విధంగా హార్డ్ డిస్క్ లు మాయం కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారాన్ని  సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించింది. ఇక ఇప్పుడు సిట్ విచారణలో ప్రభాకరరావు నోరు విప్పితే.. బీఆర్ఎస్ పెద్దలు చాలా మంది పేర్లు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

సిట్‌ విచారణలో ప్రభాకర్‌రావు నోరు విప్పుతారా...? ప్రీప్లాన్‌గా వ్యవహరిస్తారా..? అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఆయన నిజాలు చెప్తే... గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన చాలా మంది పెద్దల పేర్లు బయటకు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పుడు వారంరిలోనూ ఆందోళన మొదలైంది. మరోవైపు ప్రభుత్వం ప్రభాకర్‌రావుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మొత్తానికి తెలంగాణలో ఈనెల 5 బిగ్‌ డేగా మారనుంది. ఆ రోజు ప్రభాకర్‌రావు సిట్‌ విచారణకు హాజరవుతున్నారు. అదే రోజు మాజీ సీఎం కేసీఆర్‌ కూడా కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఒకే రోజు రెండు బిగ్ ఇష్యూస్... దీంతో... ఏం జరగబోతుంది అన్నది రాజకీయంగా ఉత్కంఠగా రేపుతోంది.