TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

పులి బాబోయ్ పులి!

Published on: Tue Jan 27, 2026 1:50PM

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం ఏజెన్సీ ప్రాంతం పెద్దపులి భయంతో వణికి పోతున్నది. గత నాలుగు రోజులుగా ఆ ప్రాంతంలోని గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేదంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. కొయ్యలగూడెం డిప్పకాయలపాడులో ఓ మొక్క జొన్న తోటలో నక్కి ఉన్న పెద్దపులిని పసిగట్టిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు కూడా హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. దీంతో గత మూడు రోజులుగా వెంటాడుతున్న పులి భయానికి ఒక చుక్కపడినట్లే నని ఏజెన్సీ ప్రాంత వాసులు భావించారు.

కానీ పొద్దుట నుంచి సాయంత్రం దాకా డిప్పకాయలపాడులోని ఓ మొక్కజొన్న తోటలో మాటు వేసి ఉన్న పెద్దపులి రాత్రికి రాత్రి అక్కడ నుంచి మాయం అయ్యింది. పులిని పట్టుకోవడానికి పొలానికి నాలుగు వైపులా అమర్చిన బోన్లు, ఆచూకీ కనిపెట్టడానికి ఉపయోగించిన ట్రాప్ కెమేరాల నిఘాను దాటుకుని ఆ పులి అక్కడ నుంచి వెళ్లిపోయింది.   సోమవారం (జనవరి 26) ఉదయం పులి డిప్పకాయల పాడు నుంచి వెళ్లినట్లు అధికారులు ధృవీకరించారు. పులి కాలి జాడలను బట్టి అది డిప్పకాయలపాడు నుంచి బల్లిమిల్లి, మర్రిగూడెం గ్రామాల వైపునకు వెళ్లినట్లు అంచనాకు వచ్చారు.

ఆదివారం (జనవరి 25) రాత్రి వరకూ డిప్పకాయల పల్లి మొక్కజొన్నతోటలోనే నక్కి ఉన్న పులి బోన్లు తప్పించుకుని, ట్రాప్ కెమేరా కంటికి చిక్కకుండా జారుకోవడం అటవీశాఖ అధికారులనే దిగ్భ్రమ పరిచింది.  అయితే పులి కదలికల ఆధారంగా డిప్పకాయలపల్లి మల్లిమిల్లి, మర్రిగూడ తదితర గ్రామాల ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ఆయా గ్రామాలలో పొలాలు, పశువుల పాకలలోని పశువులను రైతులు తమతమ ఇళ్లకు తరలించేశారు.  రాత్రి వేళల్లో ఎవరూ ఇంటి గడపదాటి బయటకు రావడం లేదు. దీంతో ప్రాణనష్టం జరగలేదు. కానీ ప్రాణభయం మాత్రం గ్రామస్థులను వెంటాడుతూనే ఉంది.  అధికారులు మాత్రం సాధ్యమైనంత త్వరగా పులిని బంధించి సురక్షిత ప్రాంతానికి తరలిం చేస్తామని చెబుతున్నారు. అంత వరకూ తమ సూచనలు, హెచ్చరికలను పాటిస్తూ.. అప్ర మత్తంగా ఉండాలని కోరుతున్నారు.