రాజమహేంద్రవరం సమీపంలో పెద్దపులి!
Published on: Thu Apr 23, 2026 10:43AM
.webp)
రాజమహేంద్రవరం సమీపంలో పెద్దపులి సంచారాన్ని అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. గత కొద్ది రోజులుగా రాజమహేంద్రవరం పరిసరాలలో పెద్దపులి సంచరిస్తున్నదంటూ స్థానికులు చెబుతున్న మాటలు వాస్తవమేనని ఈ ధృవీకరణతో తేలింది. కోరుకొడ మండలం కాపవరం పరిధిలోని పాండవుల మెట్టపై పెద్దపులి తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పాండవుల మెట్టపై పులి సంచరిస్తోందని అటవీశాఖ అధికారుల ప్రకటనతో ఒక్కసారిగా ఆప్రాంత వాసులు ఉలిక్కిపడ్డారు.
పాండవుల మెట్ట పరిసరాల్లో పులి పాదముద్రలను గుర్తించిన అటవీశాఖ అధికారులు.. ఆ పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. పొలాలకు వెళ్లే రైతులు గుంపులుగా వెళ్లాలనీ, ఒంటరిగా సంచరించవద్దనీ హెచ్చరించారు. పశువులను మేత కోసం అటవీ ప్రాంతంలోకి లేదా పాండవుల మెట్ట పైకి తోలుకెళ్లవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా రాత్రి పూట ఎవరూ అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.
ప్రస్తుతం పులి కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు అటవీ సిబ్బందితో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మెట్ట ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేశారు. పులి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని, అయితే దానికి ఎలాంటి హాని తలపెట్టకూడదని హెచ్చరించారు. పులిని బంధించేందుకు లేదా తిరిగి అడవిలోకి పంపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు భరోసా ఇచ్చారు.


