చిరుత ఎక్కడ? హిమాయత్‌సాగర్‌లో నీళ్లు తాగుతుందా?

హైదరాబాద్‌లో గురువారం నాడు సంచలనం సృష్టించిన చిరుతపులి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రస్తుతం ఎక్కడుంది? ఇవీ ఇప్పుడు జవాబుల్లేని ప్రశ్నలు. డ్రోన్‌ కెమెరాలు, డాగ్‌ స్క్వాడ్స్‌తో జల్లెడ పడుతున్నారు. పగ్‌మార్క్స్‌(పాదముద్రల) ఆధారంగా అది శంషాబాద్‌, మొయినాబాద్‌, చిలుకూరు వైపు వెళ్లి ఉంటుందని అనుమానిస్తున్నారు. చిరుత నగరానికి వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు.

లాక్‌డౌన్‌ తరుణంలో జనసంచారం, వాహనాల రణగొణధ్వనులు లేకపోవడంతో.. అడవుల నుంచి అటవీ జంతువులు జనావాసాల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువ. గగన్‌పహాడ్‌లో కనిపించిన చిరుత మొయినాబాద్‌ లేదా కల్వకుర్తి నుంచి వచ్చి ఉంటుంది.

చిరుత ఆనవాళ్లను గుర్తించినట్లు రాజేంద్రనగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ రీసెర్చ్‌ డైరెక్టర్‌ ఆర్‌.జగదీశ్వర్‌ తెలిపారు. శంషాబాద్‌ రోడ్‌ నుంచి యూనివర్సిటీ గేటు వైపు చిరుత వచ్చినట్టు యూనివర్సిటీ నిఘా బృందం గుర్తించిందని ఆయన వెల్లడించారు. ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌ ఆవరణలో ఆరునెలల కాలంలో రెండు సార్లు చిరుత కనిపించిందని అక్కడి సెక్యూరిటీ గార్డులు తెలిపారు.

రాజేంద్రనగర్‌, కాటేదాన్‌, గగన్‌పహాడ్‌, చిలుకూరు, మొయినాబాద్‌, శంషాబాద్‌ ప్రాంతాల ప్రజలను బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.

బోనులో చిక్కకుండా ముప్పుతిప్పలు పెడుతున్న చిరుత ఎట్టకేలకు కనిపించింది. రాజేంద్రనగర్ హిమాయత్‌సాగర్ వద్ద చిరుత ఆచూకీ లభించింది. హిమాయత్‌సాగర్‌లో నీళ్లు తాగుతుండగా చిరుతను స్థానికులు చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు, అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని హిమాయత్ సాగర్ వెనక వైపు ఉన్న అజీజ్‌నగర్ ప్రాంతంలో చిరుత కోసం గాలిస్తున్నారు.