శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రన్ వేపై పెద్ద పులి !

హైదరాబాద్ శివారులో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న పెద్ద పులి.. ఏకంగా శంషాబాద్ విమానాశ్రయంలోకి దూరింది.  శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వేపై  ఆదివారం అర్థరాత్రి పెద్ద పులి కనిపించడం తీవ్ర కలకలం రేపింది. దాదాపు పది నిమిషాల పాటు రన్ వేపై పెద్దపులి తిరిగింది. ఆ సమయంలో టేకాఫ్, ల్యాండింగ్ కావాల్సిన విమానాలకు అనుమతి నిరాకరించిన అధికారులు  పులిని తరిమేందుకు పరుగులు పెట్టారు. 

 10 నిమిషాల పాటు రన్ వే పైనే ఉన్న పెద్ద పులి.. తర్వాత గోడ దూకి రషీద్ గూడ వైపు వెళ్లిపోయింది. పులి సంచారంపై ఎయిర్ పోర్టు అధికారులు ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పులి జాడను కనిపెట్టేందుకు గాలిస్తున్నారు. పులి ఎటువైపు వెళ్లిందన్న విషయాన్ని గుర్తించేందుకు సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలిస్తున్నట్టు విమానాశ్రయ భద్రతా దళాలు వెల్లడించాయి. మరోవైపు ఎయిర్ పోర్టు నుంచి తమ ప్రాంతానికి పెద్ద పులి వచ్చిందని తెలుసుకున్న రషీద్ గూడ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎవరి పై పులి పంజా విసురుతుందోనన్న భయంతో ఇండ్ల నుంచి బయటికి రావటానికి జంకుతున్నారు జనాలు.