టీఆర్ఎస్ కి షాక్.. మంత్రులు, కీలక నేత ఓటమి

 

తెలంగాణ ఫలితాల్లో కాంగ్రెస్ సీనియర్లకే కాదు టీఆర్ఎస్ సీనియర్ నేతలకు కూడా షాక్ తగిలింది. ఏకంగా మంత్రులే ఓడిపోయారు. ఆ మంత్రులు ఎవరో కాదు. తుమ్మల నాగేశ్వరరావు, మరొకరు జూపల్లి కృష్ణారావు, అజ్మీరా చందూలాల్‌, పట్నం మహేందర్ రెడ్డి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తుమ్మల.. కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక్కడ ఉపేందర్ రెడ్డి 1980 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పాలేరులో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. అధికార పార్టీ టీఆర్ఎస్‌కు పాలేరు నియోజకవర్గంలో మంచి పట్టున్నా, సీనియర్ నేత తుమ్మలను బరిలోకి దింపినా.. కాంగ్రెస్ అభ్యర్థి ధీటుగా ఎదుర్కొని విజయం సాధించి టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు.

మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జూపల్లి కృష్ణారావు ఓటమి పాలయ్యారు. తన సమీప ప్రత్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డిపై దాదాపు 3వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ములుగు నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన అజ్మీరా చందూలాల్ ఓటమి పాలయ్యారు. ఆయనకు పోటీగా బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క విజయం సాధించారు. వికారాబాద్ జిల్లా తాండూర్ నుంచి బరిలోకి దిగిన మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఓడిపోయారు. మహేందర్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి గెలుపొందారు. అదేవిధంగా టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ మధుసూదనాచారి కూడా ఓటమి పాలయ్యారు. ఆయనపై పోటీ చేసిన కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి గెలిచారు. ఫలితాల్లో జోరు చూపించి అధికారం నిలుపుకున్నా.. మంత్రులు, కీలక నేతలు ఓడిపోవడం టీఆర్ఎస్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి.