విజయవాడ... మూడు హత్యల గుట్టు ఇదీ....
Published on: Wed Sep 24, 2014 12:28PM
.jpg)
విజయవాడ - ఏలూరు జాతీయ రహదారి మీద కారులో వెళ్తున్న ముగ్గురు వ్యక్తుల మీద మారుతీ వ్యాన్లో వచ్చిన దుండగులు కాల్పులు జరిపి హత్య చేసిన సంఘటన విజయవాడ ప్రాంతంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మాఫియా తరహాలో కారును వెంబడించి హత్య చేయడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు రంగప్రవేశం చేసిన తర్వాత ఈ హత్యలకు సంబంధించి వివరాలు వెల్లడి అవుతున్నాయి. ఈ కారులో మరణించిన ముగ్గురు వ్యక్తులలో ఒకరు వృద్ధుడు కాగా, మరో ఇద్దరు యువకులు. కారు డ్రైవర్ పరారీ అయ్యాడు. ఈ కారు ఏలూరుకు చెందిన ప్రైవేటు ట్రావెల్స్కి చెందింది. కారులో మరణించిన వృద్ధుడి పేరు గంధం మారయ్య. ఈయన జ్యోతిష, వాస్తు నిపుణుడు. గతంలో ఏలూరు ప్రాంతంలోని చిన్నకడిమి గ్రామంలోని ఒక హోటల్ యజమాని దుర్గారావు హత్య కేసులో నిందితుడు. రెండు కుటుంబాల మధ్య జరిగిన ఆస్తి తగాదాల కారణంగా దుర్గారావు హత్య జరిగింది. ఆ కేసులో నిందితుడైన గంధం మారయ్య ముంబై నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు విమానంలో వచ్చారు. అక్కడి నుంచి ట్రావెల్స్ కారులో ఏలూరు వైపు వెళ్తూ వుండగా మారుతీ వ్యానులో వచ్చిన దుండగులు మారయ్యతోపాటు మరో ఇద్దరు యువకులను అరెస్టుచేశారు. సంఘటన స్థలం నుంచి పారిపోయిన కారు డ్రైవర్ ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. మొత్తమ్మీద రెండు కుటుంబాల మధ్య వున్న ఆస్తి తగాదాలే ఈ హత్యలకు కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకి వచ్చారు.


