తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీలపై వేటు

 

తెలంగాణలో ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు శాసనమండలి చైర్మన్ బులిటెన్‌ను విడుదల చేశారు. టీఆర్ఎస్ నుంచి శాసనమండలికి ఎన్నికైన భూపతిరెడ్డి, రాములు నాయక్‌, యాదవరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారని టీఆర్ఎస్ నేతలు మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో పాటు కొన్ని ఆధారాలను కూడా సమర్పించడంతో వాటిని పరిశీలించిన మండలి ఛైర్మన్‌ నోటీసులు జారీ చేసి ..ముగ్గురు ఎమ్మెల్సీల వాదన విన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న మండలి ఛైర్మన్‌ ..  భూపతిరెడ్డి, రాములు నాయక్‌, యాదవరెడ్డిపై అనర్హత వేటు వేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటాలో రాములు నాయక్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా యాదవరెడ్డి ఎన్నికవగా, స్థానిక సంస్థల కోటాలో భూపతిరెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో భూపతిరెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. అలాగే రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారు. యాదవరెడ్డి మేడ్చల్‌లో జరిగిన సభలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఇదే వ్యవహారంలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కొండాసురేఖ భర్త కొండా మురళి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా శాసనమండలి ఆమోదించిన సంగతి తెలిసిందే.