ఎప్పుడెలా ఉండాలి!

 

అతనో రాజకుమారుడు. ఓ మహాసామ్రాజ్యానికి వారసుడు. అలాంటి రాజకుమారుడి పుట్టినరోజు వచ్చింది. వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్యంలోని పెద్దలంతా రాజకుమారుని స్థాయికి తగినట్లుగా తలా ఓ విలువైన కానుకా అందించారు. చివరగా రాజకుమారుడికి విద్యాబుద్ధులు నేర్పుతున్న గురువుగారి వంతు వచ్చింది. ఆయన నిదానంగా ఒక చిన్న పెట్టెను తన సంచిలోంచి బయటకు తీసి రాజకుమారుడి చేతిలో పెట్టాడు. ఆ పెట్టెలో ఏముంటుందా అని ఆశ్చర్యంగా ఎదురుచూసిన రాజకుమారుడికి మూడు మట్టి బొమ్మలు కనిపించాయి. గురువుగారు తమ కుటుంబాన్ని అవహేళన చేసేందుకే ఆ మట్టి బొమ్మలు ఇచ్చారనుకుని రాజుగారి మొహం ఎర్రబడిపోయింది. ‘ఈ బహుమతి ఇవ్వడం వెనుక మీ ఉద్దేశం తెలుసుకోవచ్చా!’ అని అడిగారు రాజుగారు.

 

‘రాజా! ఈ మూడు బొమ్మలూ సామాన్యమైవి కావు. ఇవి మూడు స్వభావాలను ప్రతిబింబిస్తాయి. కావాలంటే చూడండి...’ అంటూ ఒక దారాన్ని తీసుకుని మొదటి బొమ్మ చెవిలోంచి పోనిచ్చాడు. అది నేరుగా రెండో చెవిలోంచి బయటకు వచ్చింది. ‘కొంతమంది అవతలివారు ఏం చెబుతున్నారో వినకుండా ఈ చెవి నుంచి విని, ఆ చెవిలో వదిలేస్తారు. అలాంటి స్వభావానికి ప్రతీక ఈ బొమ్మ!’ అన్నారు గురువుగారు.

 

ఇక రెండో బొమ్మ చెవిలోంచి కూడా ఒక దారాన్ని పోనిచ్చారు గురువుగారు. అది నోట్లోంచి బయటకు వచ్చింది. ‘కొంతమంది తాము విన్న విషయాన్ని మనసులో దాచుకోలేరు. దాన్ని పదిమందికీ చేరవేస్తే కానీ వారికి తృప్తిగా ఉండదు,’ అంటూ నవ్వారు గురువుగారు.

 

గురువుగారి చేష్టలను చూసిన రాజకుమారుడిలో ఆసక్తి పెరిగిపోయింది. ఆఖరుగా ఉన్న చివరి బొమ్మ ఎలాంటి స్వభావాన్ని సూచిస్తుందా అని అంతా ఉత్కంఠంగా ఎదురుచూడటం మొదలుపెట్టారు. కానీ ఆశ్చర్యం! మూడో బొమ్మ చెవిలోంచి వెళ్లిన దారం బయటకు రానేలేదు. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు తెలిసిన విషయాన్ని బయటకు చెప్పని స్వభావానికి ప్రతీక ఈ బొమ్మ!’ అంటూ విడమరిచారు గురువుగారు.

 

‘బాగుంది! ఇంతకీ ఈ బొమ్మలలో వేటి స్వభావాన్ని అనుసరించడం మంచింది!’ అని వినయంగా అడిగాడు రాజకుమారుడు.
‘మూడింటినీ అనుసరించాల్సిందే!’ అన్నారు గురువుగారు చిరునవ్వుతో. ‘పనికిరాని విషయాలను వినీవిననట్లు ఉండాలి. ఈ చెవి నుంచి విని ఆ చెవితో వదిలేయాలి. మంచి విషయాలు, నలుగురికీ మేలు చేసే విషయాలను పదిమందితోనూ పంచుకోవాలి. ఇక పాలనకు సంబంధించిన విషయాలు, ఇతరుల వ్యక్తిగత రహస్యాలు ఎప్పటికీ మన మనసులోనే ఉంచుకోవాలి. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అన్న విచక్షణను అలవర్చుకోవడమే పాలకుడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం,’ అంటూ వివరించారు గురువుగారు. గురువుగారు ఇచ్చిన ఆ బహుమతి ముందు మిగతా విలువైన బహుమతులన్నీ వెలవెలబోయాయి.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

...Nirjara