TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హాస్పిటల్‌లో ప్లాన్.. క్లినిక్‌లో స్కాన్.. పోలీసుల వలలో ముగ్గురు!

Published on: Sat Jun 13, 2026 11:19AM

గర్భంలోని శిశువు ఆడా.. మగా..? అనే   ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు నడుస్తున్న ఓ రహస్య దందాను వనస్థలిపురం పోలీసులు చాకచక్యంగా ఛేదించి ముగ్గురిని  అరెస్టు చేశారు. మహిళా పోలీసును గర్భిణిగా పంపించి నిర్వహించిన డికాయ్ ఆపరేషన్‌తో హయగ్రీవ హాస్పిటల్ కేంద్రంగా సాగుతున్న అక్రమ లింగ నిర్ధారణ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం..  వనస్థలిపురంలోని హయగ్రీవ హాస్పిటల్‌లో రహస్యంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని అందిన పక్కా  సమాచారంతో  పోలీసులు వ్యూహం ప్రకారం వ్యవహరించి ముగ్గురిని అందుపులోకి తీసుకున్నారు.   ఓ మహిళా పోలీసును గర్భిణిగా న ఆసుపత్రికి పంపించారు. అక్కడ హాస్పిటల్ డైరెక్టర్ కొర్ర రాజు, రిసెప్షనిస్ట్ లోకేష్ ఆమెతో మాట్లాడి లింగ నిర్ధారణకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తించారు.
అయితే అసలు పరీక్షలు ఆసుపత్రిలో కాకుండా తుక్కుగూడలోని శ్రీ సాయి ధనుష్ క్లినిక్‌లో నిర్వహిస్తున్నట్లు బయటపడింది. అక్కడ పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్ స్కానింగ్ చేసి పుట్టబోయే బిడ్డ లింగాన్ని వెల్లడిస్తాడని చెప్పి గర్భవతిని అంటూ ఆస్పత్రికి వచ్చిన  మహిళా పోలీసును అక్కడికి పంపించారు. 

ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు క్లినిక్‌పై మెరుపు దాడి నిర్వహించారు. తనిఖీల్లో అక్రమ లింగ నిర్ధారణ కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించి విజయ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ వ్యవహారానికి సూత్రధారులుగా భావిస్తున్న హాస్పిటల్ డైరెక్టర్ కొర్ర రాజు, రిసెప్షనిస్ట్ లోకేష్‌లను కూడా అరెస్ట్ చేశారు. లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహించడం  చట్టం ప్రకారం తీవ్రమైన నేరం. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వ్యక్తులు, ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సమాజంలో ఇంకా కొనసాగుతున్న లింగ వివక్షకు అడ్డుకట్ట వేయాలంటే ప్రజల సహకారం అవసరమని, ఎక్కడైనా ఇలాంటి అక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.ఆడపిల్లలపై లింగ వివక్షను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని, ఎక్కడైనా అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని వనస్థలిపురం పోలీసులు విజ్ఞప్తి చేశారు.ఒక మహిళా పోలీసు ధైర్యం.. పోలీసుల వ్యూహాత్మక డికాయ్ ఆపరేషన్.. చివరికి అక్రమ లింగ నిర్ధారణ దందాకు ముగింపు పలికింది.