తిరుపతి, శ్రీశైలం, శబరిమల ఆలయాలను కూడా కూల్చండి.. దళిత సంఘాలు

 

సుప్రీంకోర్టు ఆదేశాలతో తుగ్లకాబాద్‌లో ఉన్న 500 ఏళ్ల చరిత్ర ఉన్న సంత్ రవిదాస్ ఆలయాన్ని ఈనెల 10న ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (డీడీఏ) అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇపుడు ఇదే అంశం పై దళిత సంఘాలు ఆందోళన బాట పట్టాయి. దీని కోసం దేశం నలు మూలల నుండి రాజధాని ఢిల్లీ చేరిన దళితులు మహాధర్నా చేసి, తరువాత అంబేద్కర్ భవన్ నుండి రాంలీలా మైదాన్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఐతే తుగ్లకాబాద్ లోని సంత్ రవిదాస్ ఆలయం కూల్చివేసిన ప్రదేశానికి వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకొని లాఠీ ఛార్జ్ చేయడంతో వారి ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ సందర్బంగా దళిత బహుజన గ్రూప్ ప్రతినిధి బినోయ్ కొరివి మాట్లాడుతూ అటవీ ప్రాంతం లో ఉందన్న కారణంతో రాందాస్ ఆలయాన్ని కూల్చారని మరి తిరుపతి, శ్రీశైలం, శబరిమల ఆలయాలు కూడా అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి కదా వాటిని కూడా కూల్చాలని డిమాండ్ చేశారు. 500 ఏళ్ల చరిత్ర ఉన్న సంత్ రవిదాస్ మందిరాన్ని తుగ్లకాబాద్ నుంచి తరలించే ప్రసక్తే లేదని దళిత సంఘాలు తేల్చిచెప్పాయి. అయోధ్య రామమందిరం డిమాండ్ లాంటిదే తమ పోరాటం కూడా అని వారు స్పష్టంచేశారు. అయోధ్య నుంచి రామమందిరాన్ని తరలించనప్పుడు.  తుగ్లకాబాద్ నుంచి రవిదాస్ ఆలయాన్ని ఎందుకు తరలించాలని ప్రశ్నిస్తున్నారు.