అశ్రునయనాలతో కోడెలకు తుది వీడ్కోలు... కాలినడకన వచ్చిన చంద్రబాబు

 

టీడీపీ కీలక నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌‌కు అభిమానులు, తెలుగుదేశం శ్రేణులు, కుటుంబ సభ్యులు తుది వీడ్కోలు పలికారు. నర్సరావుపేటలోని కోడెల స్వగృహం నుంచి స్వర్గపురి శ్మశానవాటిక వరకు సాగిన అంతిమ యాత్రలో అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని అడుగడుగునా నీరాజనాలు పట్టారు. దాంతో నర్సరావుపేట జనసంద్రంగా మారింది. ఇంటి నుంచి కేవలం కిలోమీటరు దూరమున్న శ్మశానవాటికకు సుమారు నాలుగు గంటలపాటు అంతిమయాత్ర సాగిందంటే ఏ స్థాయిలో అభిమానులు తరలివచ్చారో అర్థంచేసుకోవచ్చు. ఇక కోడెల అంతిమ యాత్రలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు.... కార్యకర్తలతో కలిసి శ్మశానవాటిక వరకు కాలినడకన వచ్చారు. అనంతరం నర్సరావుపేట స్వర్గపురి శ్మశాన వాటికలో కోడెల భౌతికకాయానికి చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు చివరిసారి నివాళులర్పించగా, కోడెల కుమారుడు శివరాం... చితికి నిప్పంటించారు. అయితే, తండ్రి భౌతికకాయానికి కొరివి పెడుతూ, శివరామ్ కన్నీరుమున్నీరుగా విలపించడంతో అక్కడున్నవారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు.

సోమవారం ఉదయం కోడెల ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా, మంగళవారం భారీ కాన్వాయ్‌ మధ్య హైదరాబాద్ నుంచి గుంటూరు టీడీపీ కార్యాలయానికి కోడెల భౌతికకాయాన్ని తరలించారు. తెలుగుదేశం కార్యాలయంలో పుష్పాంజలి ఘటించగా, తర్వాత నర్సరావుపేటలోని స్వగృహానికి తరలించగా, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. మూడోరోజు అభిమానులు, కుటుంబ సభ్యుల కన్నీటి నివాళి మధ్య కోడెల అంత్యక్రియలు ముగిశాయి.