ఇది అనైతిక, అనారోగ్య రాజకీయం.. సుజనా చౌదరి
Published on: Wed Sep 21, 2022 5:57PM
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం అంశంపై బుధవారం అసెంబ్లీలో విపక్షం విరుచుకు పడింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామావు హెల్త్ యూనివర్సిటీ కల సాకారం చేయ డానికి స్థాపించిన వర్సిటీకి ఆపేరు ఉండడాన్ని అన్ని వర్గాలవారూ, అన్ని పార్టీలవారూ ఆమోదించారని. అదే పేరుతో కొనసాగుతోందని ఇపుడు ఆ పేరు మార్చాలనుకోవడం దారుణమని తెలుగుదేశం సభ్యులు ఆగ్ర హించారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మార్చడం ఏపీ ప్రభుత్వ అనైతిక, అనారోగ్య రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కు తన తండ్రిపై అంత ప్రేముంటే ఏదైనా కొత్త సంస్థను స్థాపించి దానికి ఆయన పేరు పెట్టుకుంటే ఎవరూ తప్పు పట్టరని అన్నారు. ఇలాం టి చర్యలు రాబోయే రోజుల్లో అనేక అనర్ధాలకు దారి తీసే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:పరిశీలించుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని సుజనా చౌదరి అన్నారు.
కాగా, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కు పిచ్చి బాగా ముదిరిందన్నారు. అధికార మదం తలకు ఎక్కి పేర్లు మార్పు చేస్తున్నారని మండి పడ్డారు. బుద్ధి, జ్థానం లేకుండా వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా ఆమోదించారని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఆభిమా నులమని చెప్పుకునే వైసీపీ నేతల చర్య సిగ్గుచేటన్నారు. జగన్ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరకు వచ్చింది.. అందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని అన్నారు. ఎన్టీఆర్ పేరు తొలగింపుపై ప్రతి తెలుగువాడు తిరగబడాలని, ఎన్టీఆర్ పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాటం చేయా లని సీఎం రమేష్ పిలుపిచ్చారు.
అలాగే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం దుర్మార్గమని మాజీ మంత్రి పీతల సుజా త మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరు మార్చి యావత్ తెలుగుజాతిని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్ యూనివర్సిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోని జగన్రెడ్డి.. యూనివర్శిటీ నిధులు రూ.400 కోట్లు లాక్కు న్నారని ఆమె ఆరోపించారు. హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించకపోతే.. జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు దుర్మార్గమని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ, అసలు అప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నిం చారు. లక్షలాది డాక్టర్‌లు తయారయ్యే యూనివర్శిటీకి రౌడీ పేరు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నిర్ణయం మార్చుకోకపోతే చరిత్ర కూడా క్షమించదని హెచ్చరించారు.


