చిన్నారులపైనే థర్డ్‌వేవ్ ప్రభావమా? పిల్లల్లో డేంజర్ బెల్స్...
Published on: Fri Jan 14, 2022 7:08PM
రెండేళ్ల లోపు చిన్నారులపైన కూడా కరోనా మహమ్మారి ఇప్పుడు విరుచుకుపడుతోంది. కరోనా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఇటీవలే విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు వస్తున్న కరోనా కేసుల్లో 17.4 శాతం పిల్లలవే ఉంటున్నట్లు ఆ గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఏఏపీ గణాంకాల ప్రకారం అమెరికాలోని ప్రతి లక్ష మంది పిల్లల్లో 11 వేల 255 మంది కరోనా బాధితులుగా మారుతున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి 6వ తేదీ వరకు అమెరికాలో నమోదైన కేసుల్లో 5.8 లక్షల మంది పిల్లలు ఉన్నారు. అంతకు ముందు వారంతో పోలిస్తే.. పిల్లల్లో కరోనా కేసుల సంఖ్య 78 శాతం పెరిగింది. గత వారంలో 3.25 లక్షల మంది పిల్లలకు కరోనా వైరస్ సోకింది.
ఇక కరోనా ట్రీట్ మెంట్ పెద్దల కంటే పిల్లలకు వేరేగా ఉండాలని వైద్య నిపుణులు అంటున్నారు. రెండేళ్ల లోపు చిన్నారులకు కరోనా సోకితే లక్షణాల గురించి చెప్పడం కష్టం. వారికి వచ్చే లక్షణాలు సాధారణ జలుబు మాదిరిగానే ఉంటాయి. చిన్నారులకు జలుబు కామన్ గా వచ్చేదే కనుక.. ఏది మామూలు జలుబో.. ఏది కరోనానో తేల్చడం కష్టమని వైద్య నిపుణుల వివరణ. పెద్దల్లో కరోనా ఉన్నప్పటికీ కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో ఇంట్లో పిల్లలతో యధావిధిగా గడుపుతుండడం కూడా చిన్నారులు కరోనా బారిన పడేందుకు కారణం అవుతోందంటున్నారు. చిన్నప్పుడే పిల్లలకు వేసే టీకాలతో రోగ నిరోధకశక్తి ఎక్కువగానే ఉన్నప్పటికీ కరోనా సంక్రమణను కొట్టిపారేయలేమని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండడం గమనార్హం.
పిల్లల్లో మూడు రోజులకు మించి జ్వరం ఉన్నా, సరిగ్గా తినకపోతున్నా, తాగకపోయినా, అలసటగా ఉన్నా, శ్వాస ఎక్కువగా తీసుకుంటున్నా, ఆక్సిజన్ స్థాయిలు పడిపోయినా అర్జెంట్ గా వైద్య పరీక్షకు తీసుకెళ్లాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. రెండు నెలల లోపు చిన్నారులకు శ్వాస రేటు 60 కంటే ఎక్కువ ఉండకూడదు. అంతకు మించి శ్వాసరేటు ఉంటే డాక్టర్‌ను వెంటనే సంప్రదించాలని చెబుతున్నారు. రెండు నుంచి 12 నెలల చిన్నారుల్లో శ్వాస రేటు నిమిషానికి 50, రెండు నుంచి ఐదేళ్ల లోపు పిల్లల్లో 40 శాతం కన్నా ఎక్కువ ఉన్నా వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి. పిల్లల ఛాతీ లోపలికి కుంచించుకుపోయినా, గురక శబ్దం వస్తున్నా, పాలిపోయినా, నీలి రంగులోకి మారినా, కళ్లు లోపలికి పోయినా, నోరు పొడిబారినా, ముడు నాలుగు గంటలకోసారి మూత్రం పోయకపోయినా అవి కరోనా లక్షణాలే అని యునిసెఫ్ వివరించింది. చిన్నారుల్లో విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి కూడా కరోనా లక్షణాలే అని తెలిపింది.
మరో పక్కన ఒమిక్రాన్ తో చిన్నారులకు ప్రమాదం అని వైద్య నిపుణుల హెచ్చరిక. ఎగువ శ్వాస వ్యవస్థ పైనే ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువ అని, పెద్దలతో పోలిస్తే పిల్లలకు శ్వాస క్రియ ఎక్కువగా జరగడం ప్రమాదకరం అంటున్నారు వైద్య నిపుణులు. అమెరికాలో ఆస్పత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతున్నా.. వారిలో తీవ్రత మాత్రం తక్కువగా ఉందని చెబుతున్నారు. పిల్లలపై కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రత తగ్గాలంటే మాస్కులు పెట్టడం, వారి చేతులను తరచుగా కడుగుతూ ఉండాలని సూచిస్తున్నారు. పిల్లలకు విటమిన్ సీ, విటమిన్ డీ, కాల్షియం, జింక్, ఇతర పోషకాలు ఉండే ఆహారం సరిపడినంతగా ఇవ్వాలని చెబుతున్నారు.


