TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సంక్రాంతి తర్వాత థర్డ్‌వేవ్‌.. తెలంగాణ డీహెచ్ వార్నింగ్‌..

Published on: Thu Dec 30, 2021 12:26PM

న్యూఇయ‌ర్ వేడుక‌ల్లో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.. సంక్రాంతి త‌ర్వాత థ‌ర్డ్‌వేవ్ వ‌చ్చే ఛాన్స్ ఉంది.. ఈ మాట‌లు అంటున్న‌ది ఏ మీడియా సంస్థ‌నో, ఏ వార్తా క‌థ‌న‌మో కాదు. స్వ‌యానా తెలంగాణ ప్ర‌జారోగ్య‌శాఖ సంచాల‌కులు-డీహెచ్ శ్రీనివాస‌రావు మీడియా ముఖంగా చేసిన హెచ్చ‌రిక ఇది. ఆయ‌నే ఈ మాట అన్నారంటే.. ఆ మేర‌కు ప‌క్కా స‌మాచార‌మే ఉండి ఉంటుంది. 

దేశంలో కేసులు పెరుగుతున్నాయని.. తెలంగాణలోనూ గత రెండు మూడు రోజులుగా  మ‌రింత ఎక్కువయ్యాయని.. డీహెచ్ చెప్పారు. ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతోందని.. ప్రస్తుతం కేసుల పెరుగుదల థర్డ్‌వేవ్‌కు సంకేతమన్నారు. డెల్టా వేరియంట్‌ కంటే 30 రెట్ల వేగంతో ఒమిక్రాన్‌ వ్యాప్తి ఉందని చెప్పారు. 

అయితే కేసుల పెరుగుదలపై ప్రజలు అంతగా భయపడాల్సిన అవసరం లేదన్నారు. గత రెండు వేవ్‌ల్లో నేర్చుకున్న పాఠాలతో ప్రభుత్వం, వైద్యారోగ్యశాఖ ఎలాంటి విప‌త్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రజలెవరూ ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. 

ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని.. వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారా ఒమిక్రాన్‌ నుంచి రక్షించుకోవచ్చన్నారు. ఒమిక్రాన్‌ సోకిన వారిలో 90 శాతం మందికి వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని డీహెచ్‌ అన్నారు. లక్షణాలు కనిపించినవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని.. సంక్రాంతి తర్వాత థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశముందని డీహెచ్‌ శ్రీనివాసరావు హెచ్చ‌రించడం క‌ల‌క‌లం రేపుతోంది.