మెగా ఫ్యామిలీ నుంచి మూడో అమాత్యుడు.. నాగబాబుకు కన్‌ఫర్మ్ అయిన ఎమ్మెల్సీ పదవి!
Published on: Tue Mar 4, 2025 11:13AM

ఏపీ క్యాబెనెట్లో ఖాళీగా ఉన్న ఒక్క మంత్రి పదవి జనసేనాని సోదరుడు, మెగా బ్రదర్ నాగబాబుకు కన్‌ఫర్మ్ అయినట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ దిశగా కూటమి పార్టీలు యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశాయి. నాగబాబుని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా శాసనమండలికి పంపడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయించారంట. తాజాగా శాసనసభలో భేటీ అయిన సీఎం, డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు సహా వివిధ అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపికపై ఇద్దరూ కొద్ది సేపు చర్చించినట్లు తెలిసింది. ఆ క్రమంలో ఎన్నికలు జరగనున్న ఐదు స్థానాల్లో ఒకటి నాగబాబుకు ఖరారు చేశారంట.
సీఎం చంద్రబాబు శాసనసభలో తన స్థానంలో కూర్చుని ఉండగా.. పవన్ కల్యాణ్ ఆయన వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా పక్కపక్కనే కూర్చుని కొద్ది నిమిషాలు మాట్లాడుకున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి ఛాంబర్‌కు వెళ్లారు. రాష్ట్ర బడ్జెట్‌లో వివిధ శాఖలకు కేటాయింపులపై పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా తన అభిప్రాయాలు చెప్పడంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రస్తావన తెచ్చారంట. మొత్తం మీద నాగబాబుని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేయాలని నిర్ణయించడంతో.. ఇక ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టడం లాంఛనంగానే కనిపిస్తుంది.
ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతూ, ఆరు కీలక శాఖలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు నాగబాబు కొణిదెల ఫ్యామిలీ నుంచి మూడో మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.


