హరికృష్ణ కుటుంబానికే ఎందుకిలా?

నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెల్సిందే.. అయితే ఓ వైపు హరికృష్ణ మరణ వార్త విని విచారంలో ఉన్న నందమూరి అభిమానులను, ఒక ప్రశ్న వేధిస్తోంది.. హరికృష్ణ కుటుంబానికే ఎందుకిలా జరుగుతుంది?.. హరికృష్ణ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు ఎందుకిలా వెంటాడుతున్నాయి? అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 

అది 2009 .. ఓ వైపు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది.. చిన్న ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్ ని గుర్తుచేస్తూ టీడీపీ తరుపున ప్రచారం అదరగొడుతున్నాడు, ప్రజల మనస్సు గెలుచుకుంటున్నాడని నందమూరి అభిమానులు సంబరపడిపోతుండగా, ఓ సంఘటన జరిగింది.. ఎన్టీఆర్ ఖమ్మంలో ప్రచారం ముగించుకొని కారులో హైదరాబాద్ వస్తుండగా సూర్యాపేట సమీపంలోని మోతె గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ గాయపడ్డారు.. అదృష్టవశాత్తూ ఎన్టీఆర్ ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డారు.. దీంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.. తరువాత ఎన్టీఆర్ కోలుకొని ఎప్పటిలానే సినిమాలు చేసి అదరగొడుతున్నాడు.. దీంతో అభిమానులు ఆ సంఘటని మర్చిపోయారు.

 

 

కానీ 2014 లో మరో సంఘటన నందమూరి అభిమానులను కలచివేసింది.. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకి రామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.. జానకి రామ్ మరణం హరికృష్ణ కుటుంబంలో తీవ్ర విషాదం మిగిల్చింది.. జూనియర్ ఎన్టీఆర్ అయితే 'రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి, మా కుటుంబంలో జరిగిన విషాదం ఏ కుటుంబంలో జరగకూడదని కోరుకుంటున్నాం' అని పలు వేదికలపైన, సినిమాలలో కూడా అభిమానులకు, ప్రేక్షకులకు చెప్పారు.. కానీ మళ్ళీ ఆ కుటుంబంలోనే విషాదం చోటుచేసుకుంది.

 

 

నందమూరి హరికృష్ణ హైదరాబాద్‌ నుంచి నెల్లూరులోని ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా, నల్గొండ సమీపంలోని అన్నేపర్తి వద్ద రోడ్డు ప్రమాదం జరిగి మృతి చెందారు.. హరికృష్ణ కుటుంబంలో జరిగిన మూడు రోడ్డు ప్రమాదాలు నల్గొండ జిల్లాలోనే జరిగాయి.. 2009 జరిగిన ప్రమాదంలో ఎన్టీఆర్ ప్రాణాలతో బయటపడ్డారు.. కానీ 2014 లో జరిగిన ప్రమాదంలో జానకి రామ్, ఇప్పుడు 2018 లో జరిగిన ప్రమాదంలో హరికృష్ణ మృతిచెందారు.. దీంతో హరికృష్ణ కుటుంబానికే ఎందుకిలా జరుగుతుంది? అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.