ఈ దొంగలు మామూలోళ్లు కాదు.. పోలీస్ స్టేషన్‌నే ఊడ్చేశారు
Published on: Wed May 22, 2019 12:20PM

దొంగతనం జరిగిందని పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదులు రావడం సహజం. కానీ వెరైటీ గా దొంగలు ఏకంగా పోలీస్ స్టేషన్‌నే కొల్లగొట్టారు. ఈ ఘటన అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ లా ఉండే ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. సాహిదాబాద్ పోలీస్ స్టేషన్‌లో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఫోన్లు, కార్లు, ఇతర వస్తువులను పోలీసులు స్టేషన్‌లోని స్టోర్ రూంలో భద్రపరుస్తుంటారు. షాపింగ్ మాల్ లాగా అన్ని ఒకే చోట ఉన్నాయి అనుకున్నారో ఏమో.. మే 18వ తేదీ అర్ధరాత్రి సమయంలో కొందరు దొంగలు పోలీసుల కళ్లుగప్పి ఎంటరయ్యారు. 90 బ్యాటరీలు, ఫోన్లు, సీసీ కెమెరాలు, కార్లలోని విడి భాగాలను ఎత్తుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం స్టోర్ ఇన్‌ఛార్జ్ గది దగ్గరకు వెళ్లగా.. తాళం పగులకొట్టి కనిపించడంతో ఆయన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చోరీతో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


