చలి మంట కోసం బైక్ కు నిప్పు! వామ్మో వీడెవడురా బాబూ..
Published on: Sun Dec 26, 2021 8:42AM
చలి చంపేస్తోంది. చలి కాచుకునేందుకు గ్రామాల్లో జనాలు మంట పెట్టుకుంటారు. గడ్డితోనే , చెత్త చెదారాన్ని పోగేసి నిప్పు పెట్టి చాలి కాచు కుంటారు. అయితే చంపేస్తున్న వేళ కాచుకునేందుకు చుట్టూ ఏమీ దొరక్కపోవడంతో చోరీ చేసిన బైక్‌కే నిప్పు పెట్టి చలికాచుకున్నాడో దొంగ. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిందీ ఘటన. విషయం తెలిసిన పోలీసులు షాకయ్యారు.
పోలీసుల వివరాల ప్రకారం నాగ్ పూర్ యశోధరానగర్‌లో పలు ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. దీంతో పోలీస్ స్టేషన్‌కు పరుగులు పెట్టిన బాధితులు వాహనాల చోరీపై ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు చోటా సర్ఫరాజ్, అతడి నలుగురు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ కలిసి 10 బైక్‌లను చోరీ చేసినట్టు విచారణలో వెల్లడైంది. వాటిలో 9 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పదో వాహనం కనిపించకపోవడంతో దాని గురించి ఆరా తీశారు. అప్పుడు దొంగ చెప్పిన విషయం విని పోలీసులు విస్తుపోయారు. చలి బాగా వేస్తుండడంతో తట్టుకోలేక బైక్‌కు మంటపెట్టి చలికాచుకున్నట్టు చెప్పాడు.


